న్యూఢిల్లీ, వెలుగు: దేశ వ్యాప్తంగా భారీ ఆదరణ, కొనుగోలు డిమాండ్ అందుకున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకం సోమవారం లాంచ్ కానుంది. ఢిల్లీలోని ఒక హోటల్ లో జరగనున్న ఈ వేడుకకు పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరుకాబోతున్నారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకలతో పాటు పార్టీ ముఖ్యనేతలు హాజరుకానున్నారు. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం విజయ్ లతో పాటు ఇండియా కూటమికి చెందిన నేతలు పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వీరితో పాటు తెలంగాణకు చెందిన పలువురు మంత్రులు, పార్టీ కీలక నేతలకు పిలుపు అందినట్లు తెలిసింది.
లూత్రా కుమారుడి పెండ్లి వేడుకలకు
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ్ లూత్రా కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొననున్నారు. సతీమణి, కూతురితో కలిసి ఈ వేడుకల్లో పాల్గొనున్నట్లు సీఎంఓ వర్గాలు ద్వారా తెలిసింది. అనంతరం రాత్రి ఢిల్లీలో బస చేయనున్నారు. మంగళవారం మంత్రి ఉత్తమ్ తో కలిసి ఢిల్లీ నుంచి నేరుగా చత్తీస్ గఢ్ బయలుదేరి వెళ్లారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ కు సంబంధించిన నో అబ్జక్షన్ సర్టిఫికేట్(ఎన్ఓసీ) అంశంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశం కానున్నారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్ తిరిగి వెళ్లారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
