గ్యాంగ్ స్టర్ ఇంటిని కూల్చేసిన యోగి సర్కార్

గ్యాంగ్ స్టర్ ఇంటిని కూల్చేసిన యోగి సర్కార్

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకున్నది. సంఘ విద్రోహ శక్తులు, నేరస్తులు, గ్యాంగ్ స్టర్స్ ఇళ్లను కూల్చివేస్తూ.. సంచలనం సృష్టిస్తుంది. ఈ క్రమంలోనే మార్చి 3వ తేదీ.. మనీ లాండరింగ్ చేస్తూ గ్యాంగ్ స్టర్‭గా మారిన మావు నియోజకవర్గం ఎమ్మెల్యే అబ్బాస్ అన్సారీ చెందిన ఇంటిని.. యూపీ సర్కార్ బుల్ డోజర్లతో కూల్చివేసింది. 

మవు ఎమ్మెల్యే అబ్బాస్ అన్సారీ మనీలాండరింగ్ కేసులో మూడు నెలలుగా జైల్లో ఉన్నారు. ఆయన తండ్రి అబ్దుల్ అన్సారీ కూడా రాజకీయ నాయకుడు. వీరికి మౌ జిల్లాలోని జహంగీరాబాద్‭లో రెండు అంతస్తుల భవనం ఉంది. వీరు అక్కడే నివాసం ఉంటున్నారు. అయితే.. ఈ ఇంటికి స్థానిక కార్పొరేషన్ నుంచి ఎలాంటి అమనుతులు తీసుకోకుండా.. అక్రమంగా భవన నిర్మాణం చేపట్టారు. ఈ విషయాన్ని గుర్తించిన కార్పొరేషన్.. కోర్టులో కేసు వేసింది. నిబంధనలకు విరుద్దంగా బిల్డింగ్ నిర్మాణం జరిగిందని గుర్తించిన కోర్టు.. కూల్చివేయటానికి కార్పొరేషన్‭కు అనుమతి ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో బుల్ డోజర్లతో రంగంలోకి దిగిన సిబ్బంది.. అబ్బాస్ అన్సారీ, ఉమర్ అన్సారీలకు చెందిన బిల్డింగ్‭ను కూల్చివేశారు. 

దీనిపై యూపీలో రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తుందని అన్సారీ బ్రదర్స్ ఆరోపిస్తున్నారు. ఇప్పటికే మనీలాండరింగ్ కేసులో జైల్లో ఉన్నారని.. ఇప్పుడు ఇంటిని కూల్చివేయటం వెనక రాజకీయ దురుద్దేశం ఉందని వాళ్లు విమర్శిస్తున్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ జోక్యం లేదని.. ఇంటి నిర్మాణానికి అనుమతి తీసుకోలేదని.. అంతే కాకుండా కనీసం బిల్డింగ్ మ్యాప్ కూడా కార్పొరేషన్‭కు చెందిన ప్లానింగ్ డిపార్ట్‭మెంట్‭కు సమర్పించలేదని కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే చట్ట పరమైన చర్యలు తీసుకున్నట్లు అధికారులు వాదిస్తున్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా.. ఓ గ్యాంగ్ స్టర్ ఇంటిని బుల్ డోజర్స్ తో కూల్చివేయటంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. క్రిమినల్స్ విషయంలో యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తీసుకుంటున్న చర్యలకు అభినందనలు చెబుతున్నారు.