
- సీఎంఆర్ వడ్ల విలువ రూ.372 కోట్లు
- గతేడాది కస్టమ్ మిల్లింగ్ రైస్ సేకరణకు కలెక్టర్ ఆదేశం
- రికవరీపై మల్లగుల్లాలు పడుతున్న అధికారులు
నిజామాబాద్, వెలుగు: జిల్లాలోని మిల్లర్లు పదేండ్లుగా సీఎంఆర్ రైస్‌ను ఎగ్గొడుతున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో లీడర్ల అండతో వడ్లను పక్కదారి పట్టించి దర్జాగా దగా చేశారు. సీఎంఆర్ వడ్ల విలువ అసలు, వడ్డీ, ఫెనాల్టీ కలిపి రూ.372 కోట్లు ఉన్నట్లు లెక్కల్లో తేలింది. జిల్లాలోని 51 మంది మిల్లర్లు అక్రమాలకు పాల్పడ్డారు. చట్టంలో లొసుగులను అడ్డం పెట్టుకుని తప్పించుకుంటున్నారు.
పనుల ఒత్తిడి కారణంగా మిల్లర్లపై చర్యలు తీసుకోవడం లేదని అధికారులు సాకులు చెబుతున్నారు. సీఎంఆర్రైస్ ఎలా రికవరీ చేయాలని మల్లగుల్లాలు పడుతున్నారు. 2024-, 25 వానాకాలం, యాసంగి కస్టమ్ మిల్లింగ్ సేకరణలో అధికారులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
పదేండ్లుగా సీఎంఆర్ వడ్ల లూటీ..
పదేండ్లుగా సీఎంఆర్ వడ్లను మిల్లర్లు లూటీ చేస్తున్నారు. ప్రభుత్వం రైతులకు మద్దతు ధర చెల్లించి వడ్లను బియ్యంగా మార్చి రేషన్ లబ్ధిదారులకు పంపిణీ చేస్తోంది. క్వింటాల్ వడ్లకు రా రైస్ 67 కిలోలు, బాయిల్డ్ రైస్ 68 కిలోల చొప్పున మిల్లర్లు ఎఫ్‌సీఐ గోదామ్‌కి చేర్చాలి. అందుకు కస్టమ్ మిల్లింగ్ చార్జీలను ప్రభుత్వం చెల్లిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలోని 51 మంది మిల్లర్లు బీఆర్‌ఎస్ లీడర్ల అండతో పదేండ్లలో రూ.270 కోట్ల విలువైన ధాన్యాన్ని మాయం చేశారు.
తర్వాత వడ్డీ, ఫెనాల్టీతో కలిపి రూ.372 కోట్లు అయ్యింది. బోధన్‌లోని ఒక మాజీ ప్రజాప్రతినిధి నుంచి రూ.160 కోట్లు రికవరీ చేయాల్సి ఉంది. అప్పటి ప్రభుత్వంలో పలుకుబడి ఉపయోగించి 2021-, 22, 2022-, 23 సీజన్లలో సేకరించిన వడ్లను మాయం చేశారు. విచారణ పేరిట రిపోర్టులు, ఫైళ్లు తయారు చేసిన ఆఫీసర్లు రికవరీ చేయలేకపోయారు. ఈ నెల 12న కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి రివ్యూ నిర్వహించి అధికారులపై సీరియస్ అయ్యారు. అక్రమాలకు పాల్పడిన మిల్లర్ల ఆస్తులను జప్తు చేసి బహిరంగ వేలం వేసి రికవరీ చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. ప్రతి వారం పురోగతి చెక్ చేస్తానని హెచ్చరించినా అధికారుల్లో మార్పు రాకపోవడం విశేషం.
ప్రభుత్వానికి చేరని రెండు సీజన్ల రైస్
జిల్లాలో 2024, -25 వానాకాలానికి చెందిన 40 వేల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ రైస్ ప్రభుత్వానికి చేరలేదు. జూలై నెలలో రైస్ మిల్లుల్లో తనిఖీలు చేపట్టి, ఆగస్టు నెలాఖరుకు రైస్ పంపాలని సివిల్ సప్లై ఆఫీసర్లు మిల్లర్లకు నోటీసులు జారీ చేశారు. విధించిన గడువు ముగిసి మూడు వారాలు దాటినా మిల్లర్ల నుంచి రైస్ ఎఫ్‌సీఐ గోదామ్‌కి చేరలేదు. 2024-, 25 యాసంగిలో స్టేట్ రికార్డుగా 8.40 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేసి, సీఎంఆర్ కింద రైస్ మిల్స్‌కు పంపినా, అందులోంచి కేవలం 20 శాతం బియ్యం మాత్రమే వచ్చాయి. మిల్లుల్లో స్టాక్ చెకింగ్ నిర్లక్ష్యానికి గురవుతోందని అధికారులు పేర్కొన్నారు.
ఫోకస్ పెట్టాం
జిల్లాలో గత రెండు సీజన్‌ల సీఎంఆర్ వడ్ల మాయం చేసిన మిల్లర్లపై ఫోకస్పెట్టాం. కొందరు మిల్లర్లు కోర్టులకు వెళ్లడంతో యాక్షన్‌కు బ్రేక్ పడింది. చట్ట ప్రకారం రికవరీ చేయడం కొంత ఆలస్యమవుతోంది. సీఎంఆర్ రైస్ రాబట్టేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. అక్రమాలకు పాల్పడే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. శ్రీకాంత్‌రెడ్డి, డీఎం, సివిల్ సప్లై