టీఆర్ఎస్‌కు ఓటు వేయలేదని..  సీఎంఆర్ఎఫ్ చెక్ ఆపిండ్రు

టీఆర్ఎస్‌కు ఓటు వేయలేదని..  సీఎంఆర్ఎఫ్ చెక్ ఆపిండ్రు
  • వాలిడిటీ ముగిసేదాక తొక్కిపెట్టిన రూలింగ్ పార్టీ లీడర్లు
  • పాప ట్రీట్మెంట్ కోసం అప్పు చేసిన నిరుపేద తండ్రి 
  • వడ్డీ పెరుగుతోందని బాధితుల ఆవేదన

సూర్యాపేట, వెలుగు: సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేయలేదన్న కోపంతో సీఎంఆర్ఎఫ్ చెక్కు ఇవ్వకుండా బాధితులను రూలింగ్పార్టీ లీడర్లు ఇబ్బంది పెడుతున్నారు. చెక్ మరో మండలానికి వెళ్లిందని.. తెప్పించి ఇస్తామని ఒకరు.. చెక్ వాలిడిటీ అయిపోయిందని, సీఎం ఆఫీసు నుంచి మళ్లీ తెప్పిస్తామని మరొకరు చెప్తున్నారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం గుండెబోయిన గూడెం గ్రామానికి చెందిన ప్రభుదాస్, నాగమణిల ఆరు నెలల కూతురు గుండెకు సంబంధించి వ్యాధితో బాధపడుతోంది. నిరుపేదలైన ప్రభుదాస్అప్పు చేసి గత ఏడాది జనవరిలో ఖమ్మంలోని ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయించారు. ఆపరేషన్ కోసం తెచ్చిన రూ. 30 వేల మీద వడ్డీ పెరిగిపోతోంది. తెలిసినవారి సలహా మేరకు గత ఏడాది మార్చిలో సీఎం రిలీఫ్ఫండ్నుంచి సాయం కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. అప్పటినుంచి లోకల్ లీడర్ల చుట్టు తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. అయితే ప్రభుదాస్ కూతురి వైద్యానికి సీఎంఆర్ఎఫ్ నుంచి  రూ. 22 వేలు మంజూరయ్యాయి. ఈ మేరకు హుజూరాబాద్ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు చెక్ అందింది. దాన్ని పాలకవీడు మండల టీఆర్ఎస్ ప్రెసిడెంట్కు పంపారు. కానీ అక్కడి నుంచి లబ్ధిదారుడికి మాత్రం చెక్ అందలేదు. సర్పంచ్ఎన్నికల్లో ప్రభుదాస్ అన్న కాంగ్రెస్అభ్యర్థిగా పోటీ చేశాడు. ఆ కోపంతోనే రూలింగ్పార్టీ లీడర్లు చెక్ను పంపిణీ చేయలేదు. చెక్కును మూడు నెలలకు పైగా వారిదగ్గరే తొక్కిపెట్టడంతో వాలిడిటీ ముగిసి.. పనికి రాకుండా పోయింది. ఈ విషయం గురించి ఆరా తీయగా..  వాలిడిటీ అయిపోయిన చెక్ను తిరిగి సీఎం ఆఫీస్ కు పంపించామని, త్వరలో మరో చెక్కు వస్తుందని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో చెప్తున్నారు. చెక్ మిస్సయ్యిందని, మళ్లీ తెప్పించి ఇస్తామని లోకల్ లీడర్లు అంటున్నారు. 

కావాలనే ఇబ్బంది పెడుతున్నరు
సర్పంచ్ ఎన్నికలలో మా అన్న పోటీ చేశాడు. దాంతో నేను టీఆర్ఎస్కు ఓటేయలేదన్న అనుమానంతో కావాలనే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. చెక్ వేరే మండలానికి వెళ్తే ఇన్ని రోజులు ఆగుతుందా? నాకు న్యాయం చేయాలి. 
– ముండ్ల ప్రభుదాస్, గుండెబోయిన గూడెం

చెక్ మిస్ అయ్యింది
సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎమ్మెల్యే ఆఫీసుకు వస్తయ్. మండలాల వారీగా పంపేటపుడు  కొన్ని వేరే మండలానికి వెళ్లే చాన్సుంది. గతంలో కూడా ఇలా జరిగితే చెక్లు వెనక్కి తెప్పించి లబ్ధిదారులకు ఇచ్చాం. ఈ క్రమంలో  చెక్కు ఎక్కడో మిస్ అయ్యింది. త్వరలోనే వారికి చెక్కు అందజేస్తాం.
- దుర్గారావు, టీఆర్ఎస్ పాలకవీడు మండల ప్రెసిడెంట్