
- ముగిసిన దోస్త్ మూడో ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ
- 64 కాలేజీల్లో ఒక్క స్టూడెంట్ చేరలే
- బీకామ్ లో అత్యధికంగా 54 వేల అడ్మిషన్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డిగ్రీ చదువులపై ఆసక్తి క్రమంగా తగ్గుతున్నది. ఒకప్పుడు వెలుగు వెలిగిన డిగ్రీ కాలేజీలు, ప్రస్తుతం విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ చాలా కాలేజీల్లో సగం సీట్లు నిండకపోగా, 64 కాలేజీల్లో ఒక్కరు కూడా చేరలేదు. రాష్ట్రవ్యాప్తంగా 957 డిగ్రీ కాలేజీలు ఉండగా, వాటిలో 4 లక్షల36 వేల 947 సీట్లున్నాయి. 2025–26 విద్యా సంవత్సరంలో డిగ్రీ ప్రవేశాల కోసం మూడు విడుతల దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయింది. దోస్త్ ఇంట్రా కాలేజీ కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్ల షెడ్యూల్ కూడా వచ్చింది.
దోస్త్, నాన్ దోస్త్ కాలేజీలతో పాటు గురుకుల డిగ్రీ కాలేజీల్లో ఇప్పటివరకు కేవలం 1,41,590 మంది అడ్మిషన్లు తీసుకున్నారు. దీంతో ఇంకో మూడు లక్షల వరకూ సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి. ఈ లెక్కలు చూస్తుంటే, డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని స్పష్టమవుతున్నది. 2021–22 విద్యాసంవత్సరంలో 2,55,132 మంది డిగ్రీలో చేరితే, ప్రస్తుతం ఈ సంఖ్య1.41 లక్షలకు పడిపోయింది.
అప్పటి నుంచి డిగ్రీలో అడ్మిషన్లు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ సారి దోస్త్ పరిధిలోని 820 కాలేజీల్లో 3,76,956 సీట్లుండగా.. 1,20,712 మంది స్టూడెంట్లు చేరారు. 79 ఎస్సీ, ఎస్టీ, బీసీ డిగ్రీ గురుకులాల్లో 23,354 సీట్లుంటే 9,176 మాత్రమే భర్తీ అయ్యాయి. మరోపక్క నాన్ దోస్త్ కాలేజీలు 58 ఉంటే.. 36,637 సీట్లకు గానూ 11,702 సీట్లు భర్తీ అయ్యాయి.
64 కాలేజీల్లో జీరో అడ్మిషన్లు
డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపించకపోవడంతో.. అడ్మిషన్లు లేక కాలేజీలు మూతపడుతున్నాయి. ఆరు వర్సిటీల పరిధిలోని 64 కాలేజీల్లో ఒక్కరూ చేరలేదు. ఇందులో 33 ప్రైవేటు కాలేజీలు కాగా, శాతవాహన వర్సిటీలో పరిధిలో ఒక సర్కారు కాలేజీ ఉంది. వీటి పరిధిలో 20,260 సీట్లున్నాయి. జీరో అడ్మిషన్లున్న కాలేజీలు కేయూలో 22, ఎంజీయూ పరిధిలో 14, ఓయూ పరిధిలో 13, టీయూ పరిధిలో 8, పీయూ పరిధిలో ఐదు, శాతవాహన పరిధిలో రెండు ఉన్నాయి.
ఇంజినీరింగ్ వైపు ఆసక్తి
ప్రస్తుతం ఇంజినీరింగ్, మెడిసిన్ఇతర వృత్తివిద్యా కోర్సుల క్రేజ్ నడుస్తున్నది. కొంతకాలంగా ఆయా కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. ఏటా సుమారు నాలుగు లక్షల మంది ఇంటర్ పాసై బయటకు వస్తున్నారు. వారిలో గతేడాది వరకు సుమారు రెండు లక్షల మంది దాకా డిగ్రీలో చేరగా, సర్కారు నిర్వహించే ఎప్ సెట్ ద్వారా లక్ష మందికి పైగా ఇంజినీరింగ్ లో చేరుతున్నారు. ప్రైవేటు వర్సిటీలు, డీమ్డ్ వర్సిటీల్లో సుమారు 20వేల మంది వరకూ అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఎంబీబీఎస్, డెంటల్, డీఫార్మసీ, బీఫార్మసీ కోర్సుల్లో మరో 12వేల నుంచి 15వేల మంది వరకూ చేరుతున్నారు. కాగా, ఇంజినీరింగ్ లో 2022లో 82వేల మంది చేరగా, 2023లో 90వేల మంది, 2024లో 1.07 లక్షల మంది చేరారు. ఈ క్రమంలో డిగ్రీలో అడ్మిషన్లు తగ్గుతున్నాయి.
పది కోర్సుల్లో అడ్మిషన్లు
డిగ్రీలో పది కోర్సుల్లో అడ్మిషన్లు నడుస్తున్నాయి. దీంట్లో అత్యధికంగా బీకామ్ లో 54,771 మంది, బీఎస్సీ ఫిజికల్ సైన్స్ లో 27,059, బీఎస్సీ లైఫ్ సైన్స్ లో 25,130, బీఏలో 19,104, బీబీఎంలో 11,462, బీసీఏలో 3,893, డిప్లొమా కోర్సులో 87, బీబీఎంలో 68 మంది చేరారు.
గత ఐదేండ్లలో డిగ్రీలో అడ్మిషన్లు ఇలా..
2021–22 2,55,132
2022–23 2,12,818
2023–24 2,05,495
2024–25 1,96,442
2025–26 1,41,590