
-
బర్మింగ్‌హామ్ టెస్టులో అదరగొట్టిన ఆకాశ్
-
ఎన్నో కష్టాలను దాటుకొని టీమిండియాలోకి
(వెలుగు స్పోర్ట్స్ డెస్క్)
ఏడాది కిందటే ఇండియా టీమ్‌లోకి వచ్చినా ఇన్నాళ్లూ బ్యాకప్ ప్లేయర్‌గా ఉన్న ఆకాశ్ దీప్ బర్మింగ్‌హామ్‌లో బ్లాక్‌బస్టర్ పెర్ఫామెన్స్‌తో ప్రధాన పేసర్ జాబితాలోకి వచ్చే అర్హత ఉందని నిరూపించుకున్నాడు. తన కెరీర్‌లో ఓ ఇన్నింగ్స్‌లో తొలిసారి ఐదు వికెట్ల స్పెల్, ఒక మ్యాచ్‌లో పది వికెట్ల హాల్‌తో ఇప్పుడు తుది జట్టు నుంచి తనను తప్పించలేని పరిస్థితిని తీసుకొచ్చాడు. బుమ్రా వర్క్‌లోడ్, షమీ ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న దశలో పేస్ ఎటాక్‌ను ముందుకు నడిపే కొత్త అస్త్రం జట్టుకు లభించినట్టయింది.
లేటు వయసులో టీమిండియాలోకి వచ్చిన 28 ఏండ్ల ఆకాశ్ ప్రస్థానం ఓ స్ఫూర్తిదాయకమైన కథ. బీహార్‌లోని మారుమూల గ్రామం నుంచి టీమిండియా హీరోగా ఎదిగిన అతని జీవితం విషాదాలు, కష్టాలు, కన్నీళ్లతో నిండిపోయింది. కనీసం సరైన రోడ్డు మార్గం, కరెంట్ కూడా లేని రోహ్తాస్ జిల్లాలోని డెహ్రీ అనే కుగ్రామంలోనిపేద కుటుంబంలో పుట్టిన ఆకాశ్‌కు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే పిచ్చి. 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో తమ రాష్ట్రానికే చెందిన ఎంఎస్ ధోనీ కొట్టిన విన్నింగ్ సిక్స్ చూసి తానూ క్రికెటర్ అవ్వాలని కలలు కన్నాడు.
కానీ, ఆ ఊర్లో ఎవరైనా క్రికెట్ ఆడితే పిచ్చోడిలా చూసేవాళ్లు. ‘ఈ ఆట మనకు తిండి పెట్టదురా’ అంటూ అతని తండ్రి వారించేవాడు. అయినా క్రికెట్‌ను వదలని ఆకాశ్ 18 ఏళ్ల వయసులో అత్యంత విషాదాన్ని ఎదుర్కొన్నాడు. పక్షవాతానికి గురైన అతని తండ్రి సరైన వైద్యం అందక మృతి చెందాడు. ఈ షాక్ నుంచి కోలుకునేలోపే రెండు నెలల్లోనే తన అన్ననూ కోల్పోయాడు. దాంతో ఆకాశ్ జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. మూడేళ్ల పాటు క్రికెట్‌ను వదులుకోవాల్సి వచ్చింది.
రాత మార్చిన అరుణ్ లాల్
తల్లి, అక్కను చూసుకునే బాధ్యత తనపై పడటంతో ఉపాధి కోసం ఆకాశ్ కోల్‌కతాకు వెళ్లాడు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) సెకండ్ డివిజన్ లీగ్‌లో యునైటెడ్ క్లబ్‌తో తన క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఆ క్లబ్‌కు ఆడుతూ వచ్చిన డబ్బులను ఇంటికి పంపించిన ఆకాశ్ క్యాబ్‌కు చెందిన డార్మిటరీలో నాలుగేళ్లు ఉంటూ తన స్కిల్స్ మెరుగు పరుచుకున్నాడు. అక్కడే ఇండియా స్టార్ పేసర్ షమీని కలుసుకున్నాడు. షమీతో కలిసి పనిచేయడం, తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టడం ద్వారా ఆకాశ్ తన బౌలింగ్ వేగాన్ని పెంచుకున్నాడు.
ఒకప్పుడు 130 కి.మీ. వేగంతో బౌలింగ్ చేసే ఆకాశ్ ఇప్పుడు ఎక్కువ పేస్‌తో సుదీర్ఘ స్పెల్స్ వేయగలిగే స్థాయికి ఎదిగాడు. ఈ క్రమంలో బెంగాల్ టీమ్‌కు ఆడే అవకాశం తనకు లభించగా.. అక్కడ మాజీ క్రికెటర్ అరుణ్ లాల్ కంట్లో పడటం ఆకాశ్ జీవితాన్ని మార్చింది. లాల్ శిక్షణలో రాటు దేలిన ఆకాశ్.. బెంగాల్ రంజీ టీమ్‌లోకి వచ్చి కీలక పేసర్‌గా ఎదిగాడు. 2019–-20 రంజీ ట్రోఫీలో బెంగాల్ రన్నరప్‌గా నిలవడంలో ఆకాశ్ కీలక పాత్ర పోషించి వెలుగులోకి వచ్చాడు. తన రెండో ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లోనే గుజరాత్‌పై ఆరు వికెట్లు తీసి సంచలనం సృష్టించిన ఆకాశ్ ఆ సీజన్‌లో 18.02 సగటుతో 35 వికెట్లు పడగొట్టాడు.
కోహ్లీ ప్రోత్సాహం.. టీమిండియాలోకి మార్గం
బెంగాల్ తరఫున రంజీలతో పాటు వన్డే, టీ20ల్లోనూ రాణించడంతో ఐపీఎల్ చాన్స్ వచ్చింది. 2021లో ఆర్‌సీబీ తరఫున బరిలోకి దిగడంతో ఆకాశ్ ఆర్థిక కష్టాలు కొంతమేరకు తీరాయి. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరఫున అరంగేట్రం చేసినప్పుడు విరాట్ కోహ్లీ అతనికి క్యాప్ ఇచ్చాడు. ఆకాశ్ టాలెంట్ చూసిన విరాట్ కోహ్లీ ‘నువ్వు ఏదో రోజు టెస్టు క్రికెట్ ఆడగలవని’ ప్రోత్సహించాడు. దాంతో రెడ్‌బాల్ ఫార్మాట్‌పై మరింత దృష్టి పెట్టిన ఆకాశ్ రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఇండియా–ఎ తరఫున తన పేస్ పవర్ చూపించాడు. దాంతో రాంచీలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన ఆకాశ్ తొలిస్పెల్‌తోనే అదరగొట్టాడు.
స్టార్‌డమ్ రహదారిపైకి..
స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో పాటు ఆస్ట్రేలియా గడ్డపై రెండు టెస్టుల్లో బరిలోకి దిగినప్పటికీ ఇప్పటిదాకా ఆకాశ్‌ను బ్యాకప్ పేసర్‌గానే పరిగణించారు. కానీ, బుమ్రా గైర్హాజరీలో బర్మింగ్‌హామ్ ఫ్లాట్ వికెట్‌పై పది వికెట్ల పెర్ఫామెన్స్‌తో ఈ బీహార్ క్రికెటర్ పూర్తి సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది. ఇంగ్లండ్ టీమ్ ‘బజ్‌బాల్’ అప్రోచ్‌కు తగ్గట్టుగా పిచ్ ఫ్లాట్‌గా ఉన్నప్పటికీ ఇంగ్లండ్ బౌలర్లు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 9 వికెట్లు మాత్రమే తీయగలిగారు. కానీ ఆకాశ్ అద్భుతమైన సీమ్ బౌలింగ్‌తో పది వికెట్లు తీయడం అతని సత్తాకు నిదర్శనం.
రెండు స్లిప్‌లు, ఒక గల్లీ, మిడ్‌వికెట్‌లో ఫీల్డర్ల మోహరింపుతో బ్యాట్ ఎడ్జ్‌లు కాకుండా స్టంప్స్‌నే లక్ష్యంగా చేసుకొని బౌలింగ్ చేసి సక్సెస్ సాధించాడు. బర్మింగ్‌హామ్‌లో అద్భుత పెర్ఫామెన్స్ తర్వాత ఆకాశ్ తన ఛాతీని తట్టి, నేల వైపు వేలు చూపిస్తూ తాను ఈ స్థాయికి చెందినవాడినని నిరూపించుకున్నాడు. సరైన రోడ్డు కూడా లేని కుగ్రామం నుంచి వచ్చిన ఆకాశ్ ఎన్నో కష్టాలు, పరీక్షలు, విజయాలను చూసి ఇప్పుడు 'స్టార్‌డమ్' అనే రహదారిపై అడుగుపెట్టాడు. అతని జీవితం కేవలం ఒక సక్సెస్ స్టోరీనే కాదు, పట్టువదలని పోరాటం, తిరుగులేని నమ్మకానికి ఒక గొప్ప స్ఫూర్తి పాఠం అనొచ్చు.
మహ్మద్ షమీ బాటలో..
ఆకాశ్ బౌలింగ్ మహ్మద్ షమీని గుర్తు చేస్తోంది. షమీ మాదిరిగా ఆకాశ్ కూడా ఇండియాలో చాలా మంది బ్యాటర్లను బౌల్డ్ రూపంలో ఔట్ చేశాడు. స్వదేశంలో అతని పది టెస్ట్ వికెట్లలో ఏడు బౌల్డ్ రూపంలో వచ్చినవే. అతని ఫస్ట్-క్లాస్ కెరీర్‌లో 35 శాతం వికెట్లు బౌల్డ్ రూపంలోనే వచ్చాయి. ఇండియా బౌలర్లలో షమీ (38 శాతం) మాత్రమే ఈ విషయంలో ఆకాశ్ కంటే ముందున్నాడు.
ఆకాశ్ దీప్ బౌలింగ్ స్టైల్ కాస్త భిన్నంగా ఉంటుంది. అతను అసాధారణమైన లెంగ్త్స్ నుంచి స్టంప్స్‌ను పడగొట్టగలడు. చివరి రోజు హ్యారీ బ్రూక్‌ను ఔట్ చేసిన విధానమే ఇందుకు ఉదాహరణ. పిచ్‌లోని పగుళ్లపై పిచ్ అయిన ఆ బాల్ రెండు డిగ్రీలకు పైగా పక్కకు తిరిగి వికెట్లను పడగొట్టింది. బాల్ స్టంప్స్ నుంచి 7.4 మీటర్ల దూరంలో పడినా సహజ స్కిడ్ కారణంగా వికెట్లను తాకింది. ఇదే ఆకాశ్‌ను ప్రత్యేకంగా నిలుపుతుంది.
క్యాన్సర్‌తో పోరాడుతున్న అక్కకు అంకితం
చిన్నప్పుడే తండ్రి, అన్నను కోల్పోయిన ఆకాశ్ అక్క కూడా ప్రాణాపాయ స్థితిలో ఉంది. తన అక్క రెండు నెలల నుంచి క్యాన్సర్‌తో పోరాడుతోందని ఆకాశ్ వెల్లడించాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో పది వికెట్ల హాల్‌ను ఆమెకు అంకితం ఇస్తున్నట్టు తెలిపాడు. ‘నా చేతిలో బాల్ ఉన్న ప్రతిసారీ ఆమె ఆలోచనలే నా మనసులోకి వచ్చాయి. రెండు నెలల క్రితం మా అక్కకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.
నా పెర్ఫామెన్స్‌తో ఆమె చాలా సంతోషిస్తుంది. ఇది తన ముఖంపై మళ్లీ చిరునవ్వులు తీసుకువస్తుంది. నేను బౌలింగ్ చేస్తుండగా ప్రతి బంతికి ఆమె గురించే ఆలోచించా. ఈ పెర్ఫామెన్స్ ఆమెకే అంకితం’ అని ఆకాశ్ దీప్ భావోద్వేగంగా వెల్లడించాడు. రాబోయే లార్డ్స్ టెస్ట్ గురించి ఆలోచించకుండా, ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదిస్తానని చెప్పాడు.