మల్లెపూలు ఎంత పనిచేశాయ్.. చిక్కుల్లో సినీ నటి.. పాపం.. లక్ష ఫైన్ పడింది..!

మల్లెపూలు ఎంత పనిచేశాయ్.. చిక్కుల్లో సినీ నటి.. పాపం.. లక్ష ఫైన్ పడింది..!

మలయాళ నటి నవ్య నాయర్కు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ విమానాశ్రయంలో వింత అనుభవం ఎదురైంది. హ్యాండ్ బ్యాగ్లో మల్లెపూలు దొరకడంతో మెల్ బోర్న్ విమానాశ్రయంలో అధికారులు ఆమెను అడ్డుకున్నారు. మల్లెపూలు తీసుకెళుతుందనే కారణంగా 1980 ఆస్ట్రేలియన్ డాలర్లు.. అంటే మన కరెన్సీలో లక్షా 14 వేల రూపాయల జరిమానా విధించారు. 28 రోజుల లోపు ఆ జరిమానా చెల్లించాలని లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

విమానాశ్రయంలో తనకు ఎదురైన ఈ పరిణామంతో నవ్య నాయర్ విస్తుపోయింది. ఆస్ట్రేలియాలో మలయాళీ అసోసియేషన్ ఆఫ్ విక్టోరియా నిర్వహించిన ఓనం వేడుకలకు హాజరయ్యేందుకు నవ్య నాయర్ మెల్ బోర్న్ వెళ్లింది. ఈ సందర్భంలో ఆమెకు ఇలా జరిగింది. సింగపూర్ నుంచి మెల్ బోర్న్ వచ్చి ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వెళుతుండగా తనకు ఈ అనుభవం ఎదురైందని ఆమె తెలిపింది. ఎయిర్ పోర్ట్ లో ఏం జరిగిందనే విషయాన్ని ఓనం వేడుకల అనంతరం.. నవ్య నాయర్ పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చింది.

తన తండ్రి మల్లెపూలు కొని తనకు ఇచ్చారని.. మల్లెపూల మాలను రెండుగా చేసి ఒకటి తన తలలో పెట్టుకోవాలని చెప్పారని.. అలానే పెట్టుకున్నానని ఆమె చెప్పింది. మరో మల్లెపూల మాలను హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నానని తెలిపింది. కొచ్చి నుంచి సింగపూర్ వస్తూ మల్లెపూలు తలలో పెట్టుకున్నానని, మరో మల్లె పూల దండ హ్యాండ్ బ్యాగ్లో అలానే ఉందని చెప్పింది. అయితే.. అలా మల్లె పూలను విమానాశ్రయానికి తీసుకురావడం, విమానంలో మల్లెపూలను పెట్టుకోవడం ఆస్ట్రేలియా రూల్స్కు వ్యతిరేకమని, తనకు ఈ విషయం తెలియదని నవ్య నాయర్ పేర్కొంది. తనకు తెలియక జరిగిన పొరపాటే తప్ప కావాలని చేయలేదని తెలిపింది. 28 రోజుల లోగా జరిమానా కచ్చితంగా కట్టాలని ఎయిర్ పోర్ట్ అధికారులు తనకు స్పష్టం చేశారని నవ్య నాయర్ తెలిపింది.