
- రూరల్‌లో ఒక్కో ఇంటికి అదనంగా కేంద్రం నుంచి రూ.39 వేలు
- ప్రతి లబ్ధిదారుడికి ఉపాధి జాబ్ కార్డు అందేలా చర్యలు
- పూర్తయిన ఇండ్లను వెంటనే లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌కు కేంద్రం నుంచి అదనంగా ఫండ్స్ వస్తున్నాయి. ప్రస్తుతం రూరల్‌లో ఒక్కో ఇంటికి పీఎం ఆవాస్ యోజన కింద రూ. 72 వేలు ఇస్తుండగా.. ఇప్పుడు ఉపాధి హామీ, స్వచ్ఛ భారత్ ఫండ్స్ రానున్నాయి. ఇందిరమ్మ స్కీమ్‌కు ఈ రెండు పథకాలను అనుసంధానం చేస్తూ హౌసింగ్ శాఖ సెక్రటరీ వీపీ గౌతమ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఒక్కో ఇందిరమ్మ ఇంటికి ఉపాధి హామీ స్కీమ్ కింద రూ. 27 వేలు, స్వచ్చ భారత్ మిషన్(ఎస్‌బీఎం) కింద రూ.12 వేలు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందనున్నాయి. ఇంటి నిర్మాణం చేసుకుంటున్న లబ్ధిదారుడికి ఉపాధి హామీ కార్డులు ఉంటే, ఇంటి పని కింద 90 రోజులు పనిచేసినందుకు కూలీ కింద రోజుకు రూ.300 చొప్పున కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించనున్నాయి. వీటితో పాటు ఎస్‌బీఎంలో టాయిలెట్స్ నిర్మాణంతోపాటు ఇతర పారిశుధ్య పనులకు రూ.12 వేలు కేంద్రం ఇవ్వనుంది.
ఇప్పటి వరకు 3 లక్షల ఇండ్లు మంజూరు చేయగా.. ఇందులో 2 లక్షల మందికి ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉన్నాయని, మిగతా లక్ష మందికి ఉపాధి హామీ కార్డులు ఇవ్వాలని గ్రామీణాభివృద్ధి శాఖకు హౌసింగ్ అధికారులు లేఖ రాశారు. తొలి దశలో పేదవాళ్లకు మాత్రమే ఇల్లు మంజూరు చేసినందున.. ప్రతి లబ్ధిదారుడు ఉపాధి కార్డుకు అర్హులుగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు. రూరల్‌లో ఒక్కో ఇంటికి పీఎం అవాస్ స్కీమ్ కింద రూ. 72 వేలు ఇస్తుండగా.. ఈ రూ. 39 వేలు అదనంగా రానున్నాయి. మొత్తం ఒక్కో ఇంటికి రూ. 1.11 లక్షలు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి అందనున్నాయి. మిగతా రూ.3.89 లక్షలు రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది.
వచ్చే నెలలో రూరల్ ఇండ్ల మంజూరు
కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా అక్టోబర్‌లో పీఎం అవాస్ స్కీమ్ కింద ఇండ్లను మంజూరు చేస్తుంది. నిరుడు సర్వే స్టార్ట్ కానందున రూరల్ లో మంజూరు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత ఇండ్లు లేని వారి నుంచి ప్రజా పాలనలో అప్లికేషన్లు తీసుకున్నది. వీరిలో సుమారు 65 లక్షల మందిని అధికారులు అర్హులుగా తేల్చారు. అయితే, ఈ లెక్కలను కేంద్రం అంగీకరించకుండా కేంద్ర యాప్‌లో సర్వే చేసి వివరాలు పంపాలని ఆదేశించింది.
తొలి దశలో సుమారు 16 లక్షల మంది సొంత జాగా ఉండి.. ఇండ్లు లేని వాళ్లు ఉండగా.. ఇప్పటి వరకూ కేంద్ర యాప్ ప్రకారం 5 లక్షల మంది సర్వే పూర్తయిందని హౌసింగ్ అధికారులు చెబుతున్నారు. సర్వే పూర్తయిన అప్లికేషన్లను పరిశీలించి ఇండ్లను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నా.. కేంద్రం పరిగణనలోకి తీసుకోవడం లేదు. సర్వే మొత్తం పూర్తయ్యాకే మంజూరు చేస్తామని స్పష్టం చేసినట్లు తెలుస్తున్నది. వచ్చే నెలలో రూరల్‌లో ఇండ్లను మంజూరు చేయనున్నట్లు తెలుస్తున్నది.
వేగంగా ఇండ్ల ఓపెనింగ్
రాష్ట్రవ్యాప్తంగా 2 దశల్లో 3 లక్షల 18 వేల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయగా.. 2 లక్షల ఇండ్ల పనులు స్టార్ట్ అయ్యాయి. ఇందులో లక్ష వరకు బేస్‌మెంట్ సైతం పూర్తి కాగా, 6 వేల ఇండ్లు స్లాబ్ వరకు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం బెండాలపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
ఇప్పటి నుంచి ఇంటి నిర్మాణం పూర్తయిన ఇండ్లను లేట్ చేయకుండా జిల్లా ఇన్‌చార్జి మంత్రులు, జిల్లా మంత్రులతో వెంటనే ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆ తర్వాత నుంచి అన్ని జిల్లాల్లో మంత్రులు ఇండ్లను ప్రారంభిస్తున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇప్పటి నుంచి వచ్చే ఏడాది జూన్ వరకు వేగంగా ఇండ్ల నిర్మాణాలు జరపాలని, ఇందుకు లబ్ధిదారులకు హౌసింగ్ అధికారులు అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. ఫండ్స్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి సోమవారం లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాకు నిధులు బదిలీ చేస్తున్నారు.
పలుచోట్ల పంచాయతీ కార్యదర్శులు, హౌసింగ్ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఇందిరమ్మ యాప్ డౌన్ లోడ్ చేసుకొని నేరుగా లబ్ధిదారుడే ఇంటి ఫోటో తీసి.. అప్‌లోడ్ చేసే సదుపాయాన్ని అధికారులు కల్పించారు. అలాగే, ఆధార్, బ్యాంక్ ఖాతాలో పేర్లు, ఇంటి పేర్లలో తప్పులు ఉన్నా సరి చేసుకునే అవకాశం, ఆధార్‌తో లింక్ అయిన బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వ సాయం బదిలీ చేయడం, ఆన్ లైన్‌లో ప్రభుత్వ సాయం స్టేజ్ తెలుసుకునే విధంగా అధికారులు యాప్ లో మార్పులు చేశారు.
ఆర్థిక భారం తగ్గే మార్గాల అన్వేషణ
ఇందిరమ్మ స్కీమ్‌లో ఒక్కో ఇంటికి 100 శాతం సబ్సిడీతో రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షలు లబ్ధిదారుడికి అందజేస్తున్నది. అర్బన్‌లో 1.13 లక్షల ఇండ్లను కేంద్రం మంజూరు చేయగా.. రూరల్‌లో ఇంత వరకూ ఒక్క ఇంటిని కూడా మంజూరు చేయలేదు. కేంద్రం ఇవ్వకున్నా రూ. 5 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఇటీవల హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు.
రూరల్‌లో వేగంగా ఇండ్ల నిర్మాణం జరుగుతుండటం, కేంద్రం ఇండ్లు మంజూరు చేయకపోవడంతో మంత్రి పైవిధంగా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై స్కీమ్ అమలుకు భారం తగ్గించేలా ఉన్న అన్ని ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని సీఎం ఆదేశించడంతో ఉపాధి, స్వచ్చ భారత్ స్కీమ్‌లకు అనుసంధానం చేశారు. ఇప్పటి వరకు రూరల్‌లో నిర్మాణంలో ఉన్న ఇండ్లకు 4 దశల్లో భాగంగా లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేస్తున్న సాయం.. రూ.వెయ్యి కోట్లు దాటింది.