
మంచిర్యాల: వాళ్లిద్దరిది ఒకటే గ్రామం. చిన్నప్పటి నుంచే ఒకొరికరు పరిచయం. కొన్నాళ్లకు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుని జీవితాంతం ఇద్దరూ కలిసి జీవించాలని కళలు కన్నారు. కానీ ఆ కళలు కొన్నాళ్లకే చిధ్రమయ్యాయి. ప్రేమ విఫలం అయిందని మనస్థాపంతో యువతి రైలు కింద పడి చనిపోయింది. ప్రియురాలు మరణవార్త తెలిసి బావిలో దూకి యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొర్విచెల్మ గ్రామానికి చెందిన హితవర్షిణి, వినయ్ ప్రేమికులు. ఇద్దరి మధ్య ఏమైందో తెలియదు గానీ.. ప్రేమ విఫలం అయిందని మనస్థాపంతో హితవర్షిణి హైదరాబాద్లో రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలి మరణవార్త తెలిసి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ప్రియుడు వినయ్.
ఇద్దరు ప్రేమికులు మృతి చెందడంతో కొర్విచెల్మ గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. అయితే.. ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా..? లేక ప్రేమ విషయం ఇంట్లో తెలిసిందా..? పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని ఆత్మహత్యకు పాల్పడ్డారా..? అన్న విషయం తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.