జడ్ -జెన్ ఆందోళనల ఎఫెక్ట్: నేపాల్ హోం మంత్రి పదవికి రమేష్ లేఖక్ రాజీనామా

జడ్ -జెన్ ఆందోళనల ఎఫెక్ట్: నేపాల్ హోం మంత్రి పదవికి రమేష్ లేఖక్ రాజీనామా

ఖాట్మండు: Z-జెన్ యువత నిరసనల ఎఫెక్ట్‏తో నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ప్రధాని కేపీ శర్మ ఓలికి అందజేశారు. Z-జెన్ యువత చేపట్టిన నిరసనల్లో 19 మంది మృతి చెందడానికి నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు రమేష్ లేఖక్ రాజీనామా లేఖలో పేర్కొన్నారు. సోమవారం (సెప్టెంబర్ 8) సాయంత్రం జరిగిన కేబినెట్ సమావేశంలో రమేష్ లేఖక్ తన రాజీనామాను ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలికి సమర్పించారని సీనియర్ మంత్రి ఒకరు ధృవీకరించారు. 

నేపాల్‎లో Z-జెన్ యువత చేపట్టిన ఆందోళనలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. దేశంలో సోషల్ మీడియా నిషేధాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం (సెప్టెంబర్ 8) నేపాల్ యువత పెద్ద ఎత్తున రోడ్డుక్కెంది. పార్లమెంట్ భవనాన్ని ముట్టడించి లోపలోకి దూసుకెళ్లారు నిరసనకారులు. దీంతో నిరసనకారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆందోళనకారులను అదుపు చేయడానికి పోలీసులు రబ్బరు బుల్లెట్లు, టియర్ గ్యాస్ ప్రయోగించడంతో 19 మంది ఆందోళనకారులు మృతి చెందగా.. వందల సంఖ్యలో ఆందోళనకారులు గాయాల పాలయ్యారు. 

యువత ఉద్యమం హింసాత్మకంగా మారడంతో అప్రమత్తమైన ప్రభుత్వం దేశంలోని పలు ప్రాంతాల్లో కర్య్ఫూ విధించడంతో పాటు షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ జారీ చేసింది. నేపాల్ రాజధాని ఖాట్మండు, న్యూ బనేశ్వర్‌,  పోఖారా, బుత్వాల్, భైరహవా, ఇటాహరి, రూపండేహి, సున్సారీతో పాటు పలు ప్రాంతాల్లో కర్య్ఫూ విధించారు. కఠినమైన ఆంక్షలను అమలు చేశారు. బహిరంగ సభలు, ర్యాలీలు, సిట్-ఇన్‌స్ట్రక్షన్‌లపై నిషేధం విధించారు.