భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పంట కాల్వలో గంజాయి ప్యాకెట్లు

 భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పంట కాల్వలో గంజాయి ప్యాకెట్లు

దమ్మపేట, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అచ్యుతాపురం గ్రామ శివారులో ఉన్న ఓ పామాయిల్‌‌ తోటలోని కాల్వలో గంజాయి ప్యాకెట్లు దొరికాయి. రైతు గుజ్జుల వెంకటేశ్వరావు సోమవారం ఉదయం తన తోటలో కాల్వ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో భూమిలో కొన్ని ప్యాకెట్లు కనిపించడంతో గంజాయిగా అనుమానించి అశ్వరావుపేట పోలీసులకు సమాచారం ఇచ్చాడు. 

వారు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. తోట దమ్మపేట మండల పరిధిలో ఉండటంతో అక్కడి ఎస్సై సాయి కిశోర్‌‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. పోలీసులు తోట వద్దకు చేరుకొని పరిశీలించగా 44 గంజాయి ప్యాకెట్లు దొరికాయి. దానిని ఎవరు దాచారు ? ఎక్కడి నుంచి తెచ్చారు ? అన్న వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.