ఏసీబీకి చిక్కిన సివిల్‌‌ సప్లై డీటీ..సీజ్‌‌ చేసిన వెహికల్స్‌‌ రిలీజ్‌‌ చేసేందుకు రూ.70 వేలు డిమాండ్‌‌

ఏసీబీకి చిక్కిన సివిల్‌‌ సప్లై డీటీ..సీజ్‌‌ చేసిన వెహికల్స్‌‌ రిలీజ్‌‌ చేసేందుకు రూ.70 వేలు డిమాండ్‌‌
  • ట్రాప్‌‌ అయిన విషయం తెలియడంతో మూడు నెలలుగా పరారీ
  • ఎట్టకేలకు నల్గొండలో పట్టుకున్న ఏసీబీ ఆఫీసర్లు

నల్గొండ, వెలుగు : పీడీఎస్‌‌ బియ్యాన్ని తరలిస్తూ పట్టుబడిన కేసులో సీజ్‌‌ అయిన వాహనాలను రిలీజ్‌‌ చేసేందుకు మిర్యాలగూడ సివిల్‌‌ సప్లై డీటీ జావీద్‌‌ డబ్బులు డిమాండ్‌‌ చేశాడు. విషయం తెలుసుకున్న ఏసీబీ ఆఫీసర్లు డీటీని పట్టుకునేందుకు ప్రయత్నించడంతో మూడు నెలలుగా పరారీలో ఉన్నాడు. చివరకు నల్గొండలో ఏసీబీ ఆఫీసర్లకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే... మార్చి 24న పీడీఎస్‌‌ బియ్యాన్ని లారీ, బొలెరో తరలిస్తుండగా మిర్యాలగూడ రూరల్‌‌ పోలీసులు పట్టుకొని కేసును సివిల్‌‌ సప్లై శాఖకు అప్పగించారు. 

సదరు వాహనాలను రిలీజ్‌‌ చేయాలని వాటి యజమాని ఏప్రిల్ 20న మిర్యాలగూడ సివిల్‌‌ సప్లై డీటీ జావీద్‌‌ను కలిశాడు. దీంతో రూ. లక్ష ఇవ్వాలని డీటీ డిమాండ్‌‌ చేయగా.. అంత ఇచ్చుకోలేనని బాధితుడు చెప్పడంతో రూ.70 వేలకు ఒప్పందం జరిగింది. తర్వాత అదే నెల 24న బాధితుడు ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. దీంతో డీటీని ట్రాప్‌‌ చేసేందుకు బాధితుడి ఫోన్‌‌ నుంచి కాల్‌‌ చేసి రికార్డ్‌‌ చేసేందుకు ప్లాన్‌‌ చేశారు. ఇందులో భాగంగా ఏప్రిల్‌‌ 29న డీటీ కాల్‌‌ చేయగా.. ట్రాప్‌‌ చేస్తున్నారని గుర్తించిన డీటీ మొబైల్‌‌ను స్విచ్‌‌ ఆఫ్‌‌ చేసి పరారయ్యాడు. 

జూన్‌‌ 5న కేసు నమోదు చేసిన ఏసీబీ ఆఫీసర్లు 9న ఎఫ్‌‌ఐఆర్‌‌ కాపీని డీటీకి పంపించారు. కేసు నమోదు గురించి తెలుసుకున్న డీటీ ఏసీబీకి, పోలీసులకు చిక్కకుండా రాయచూర్‌‌, ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో తిరిగాడు. చివరకు విజయవాడ నుంచి సూర్యాపేట మీదుగా నల్గొండకు వస్తున్నట్లు ఏసీబీ ఆఫీసర్లకు సమాచారం అందడంతో శనివారం రాత్రి ఖాజీరామారం వద్ద డీటీ జావీద్‌‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌‌ కాపీలను, ఇతర డాక్యుమెంట్లను నల్గొండ సివిల్‌‌ సప్లై ఆఫీస్‌‌ నుంచి స్వాధీనం చేసుకున్నారు. డీటీపై కేసు నమోదు చేసి సోమవారం ఏసీబీ కోర్టులో హాజరుపర్చామని డీఎస్పీ జగదీశ్వర్‌‌ తెలిపారు.