
నాగర్‌కర్నూల్, వెలుగు : ‘గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పక్క రాష్ట్రంతో లాలూచీ పడి కృష్ణా పరీవాహక ప్రాంత రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టింది.. బనకచర్ల పాపం ముమ్మాటికీ కేసీఆర్‌దే’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణకు దక్కాల్సిన వాటాలో చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి, కలెక్టర్ బాదావత్ సంతోష్‌తో కలిసి అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలోని 536 మంది చెంచు కుటుంబాలకు సోమవారం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ...ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌తో పేదల సొంతింటి కల నెరవేరుతోందన్నారు. ఐటీడీఏ పరిధిలోని 21 నియోజకవర్గాల్లో 13,266 చెంచు కుటుంబాలను విడతల వారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. ఇండ్లు ఇల్లు రాలేదని ఎవరూ నిరుత్సాహపడొద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు.
పేదలకు ఇండ్లు కట్టించలేని మాజీ సీఎం కేసీఆర్.. తన కోసం మాత్రం రూ. 2 వేల కోట్లు ఖర్చు చేసి ఇల్లు కట్టుకున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ అవినీతికి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక నమూనా అని ఎద్దేవా చేశారు. అంతకుముందు అమ్రాబాద్ పీడబ్ల్యూ బీటీ రోడ్డుకు, గిరిజన భవన్ కాంపౌడ్ వాల్ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, డీఎఫ్‌వో, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో రోహిత్ గోపిడి, అడిషనల్ కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం పాల్గొన్నారు.
ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాం : మంత్రి జూపల్లి
ఇచ్చిన ప్రతి హామీతో పాటు పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. గత ప్రభుత్వం పదేండ్ల పాలనలో రూ. 8 లక్షల కోట్ల అప్పు చేసి ప్రజల నెత్తిన రుద్దిందని మండిపడ్డారు. నల్లమల చెంచులకు ఒక్క ఇల్లైనా కట్టించారా అని ప్రశ్నించారు. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా.. ఇచ్చిన మాటకు కట్టుబడి అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరో పదేండ్లు అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.