గ్యాస్ కొరత లేదు.. పెట్రోల్ కొరత లేదు.. ఎందుకు హైరానా పడుతున్నారు.. ఎందుకు టెన్షన్ పడుతున్నారు.. కేంద్ర ప్రభుత్వం నుంచి లోకల్ అధికారుల వరకు ఇదే చెబుతున్నారు. గ్రౌండ్ రియాల్టీ మాత్రం భిన్నంగా ఉంది. పెట్రోల్ బంకుల దగ్గర క్యూలు.. తమ ఆటోలకు CNG గ్యాస్ కోసం డ్రైవర్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్ స్టేషన్ల దగ్గర గంటలు గంటలు వెయిట్ చేస్తున్నారు. ఆటోలను క్యూలో పెట్టి.. గ్యాస్ కొట్టండి.. గ్యాస్ ఇవ్వండి.. మా జీవితాలను నిలబెట్టండి అంటూ వేడుకుంటున్నారు ఆటోవాలాలు.
2026, మార్చి 26వ తేదీ మధ్యాహ్నం CNG ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. రెండు రోజులుగా గ్యాస్ కోసం వెయిట్ చేస్తున్నామని.. క్యూలో పడిగాపులు కాస్తున్నామంటున్నారు ఆటోవాలాలు. బంకు యజమానులు మూసేసి వెళ్లిపోతున్నారు.. అధికారులు సరైన సమాధానం ఇవ్వటం లేదు.. మమ్మల్ని పట్టింకునే నాధుడే లేడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓపిక నశించిన ఆటోవాలాలు.. హైదరాబాద్ సిటీలోని లక్డీకపూల్ చౌరస్తాలో బైఠాయించారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.
ఆటోవాలాల నిరసనతో ట్రాఫిక్ జాం అయ్యింది. ట్రాఫిక్ పోలీసులు వచ్చారు. గ్యాస్ ఉంటే కొడతారు కదా.. గ్యాస్ లేకపోతే బంకు యజమానులు ఏం చేస్తారంటూ వాళ్లకు సర్దిచెప్పి ధర్నాను విరమింపజేశారు. రోజూ ఆటో తోలితేనే జీవితం నడుస్తుందని.. రెండు రోజులుగా గ్యాస్ లేక పనులు లేవని.. కుటుంబాన్ని ఎలా పోషించాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆటోవాలాలు.
ఓ వైపు కేంద్రం గ్యాస్ కొరత లేదు.. ఇంధన కొరత లేదు అని పదే పదే చెబుతోంది. మరోవైపు గ్రౌండ్ రియాల్టీ అందుకు భిన్నంగా ఉంది.
