
హైదరాబాద్, వెలుగు: కో లివింగ్ పేరుతో హైదరాబాద్లో విష సంస్కృతి పెరిగిపోతుందని, ఇలాంటి హాస్టళ్లను రద్దు చేయాలని ఓయూ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం వారు డీజీపీ జితేందర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఓయూ జేఏసీ చైర్మన్, బీజేపీ లీడర్ రాజు నేత మాట్లాడుతూ.. హైదరాబాద్ లో కో లివింగ్ పేరుతో యువతీ యువకులను ఒకే చోట పెట్టి హాస్టల్స్ నడుపుతున్నారని, ఈ సిస్టమ్తో మన సంస్కృతి దెబ్బతినే ప్రమాదముందని అన్నారు.
ఇంజినీరింగ్ స్టూడెంట్స్, ఐటీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని వారి జీవితాలను నాశనం చేస్తున్నారని తెలిపారు. ఈ హాస్టళ్లలోనే మాదకద్రవ్యాలు వినియోగం ఎక్కువగా నడుస్తోందన్నారు. రైడ్లు నిర్వహించి చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు తెలంగాణలో గన్ కల్చర్ ఆందోళన కలిగిస్తోందన్నారు.
కొంతమంది వ్యాపారులు అంతర్రాష్ట్ర ముఠాలతో కుమ్మక్కై, గన్ కల్చర్ ను ప్రోత్సాహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మలిదశ తెలంగాణ ఉద్యమకారులు చెరుకు మణికంఠ, ఏకుల జగన్, ఇమ్మడి మహేశ్, గద్దె మహేశ్, సత్తూరి శ్రీశైలం, గోవింద్ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.