అయ్యర్ ఆటపై నమ్మకం కుదిరితే తుది జట్టులో చోటు : ద్రవిడ్

అయ్యర్ ఆటపై నమ్మకం కుదిరితే తుది జట్టులో చోటు : ద్రవిడ్

వెన్నునొప్పి నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్ ఫిట్గా ఉంటే రెండో టెస్టులో ఆడతాడని కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు. అందులో ఎలాంటి డౌట్ అవసరం లేదన్నాడు. వెన్నునొప్పి నుంచి పూర్తిగా కోలుకున్న అయ్యర్...ప్రాక్టీస్ సెషన్లోనూ పాల్గొన్నాడని చెప్పాడు. గురువారం ప్రాక్టీస్ సెషన్లో అయ్యర్ ఆటతీరును చూసి అతనిపై నమ్మకం కుదిరితే తుది జట్టులో చోటు కల్పిస్తామని ద్రవిడ్ వెల్లడించాడు. 

శ్రేయస్ అయ్యర్ స్పిన్ను సమర్థవంతంగా ఎదుర్కొంటాడని ద్రవిడ్ తెలిపాడు. అరంగేట్ర మ్యాచ్ నుంచి శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఆడుతున్నాడని కితాబిచ్చాడు. క్లిష్టపరిస్థితుల్లో జట్టుకు అండగా నిలిచాడని గుర్తు చేశాడు. అయ్యర్ తిరిగి జట్టులో చేరడం శుభసూచకమన్నాడు. మెరుగ్గా ఆడేవారికే తాము అధిక ప్రాధాన్యత ఇస్తామని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. 

ద్రవిడ్ మాటలను బట్టి రెండో టెస్టులో శ్రేయస్ అయ్యర్ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. శ్రేయస్ జట్టులోకి వస్తే మాత్రం సూర్యకుమార్ యాదవ్ లేదా కేఎస్ భరత్లు బెంచ్ కే పరిమితం కాక తప్పదు.