
- బెంచికి నలుగురు.. క్లాసులో వంద మంది!
- కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో కరోనా గైడ్‌లైన్స్ గాలికి
- ప్రభుత్వ ఉత్తర్వులు పట్టించుకోని మేనేజ్ మెంట్లు
- బెంచీలు, బాత్రూంల క్లీనింగ్ పైనా పట్టింపు కరువు
- ఇష్టమొచ్చినట్టు కోచింగ్ సెంటర్ల నిర్వహణ
ఇది హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్. మస్తు మంది జనాలున్నరు కదా అని ఇక్కడ పెళ్లో లేదంటే వేరే ఏదో ఫంక్షనో జరుగుతుందనుకుంటే తప్పులో కాలేసినట్టే. అక్కడ ఏ ఫంక్షనూ జరగట్లేదు. క్లాసులు జరుగుతున్నయి. జాబ్స్ కోసం కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులు వీళ్లంతా. సర్కారు పెట్టిన కరోనా రూల్స్‌ను పట్టించుకోకుండా ఓ కోచింగ్ సెంటర్ వాళ్లు ఇలా వందలాది మందిని ఫిజికల్ డిస్టెన్స్ లేకుండానే కూర్చోబెట్టి క్లాసులు చెప్తున్నారు మరి.
హైదరాబాద్, వెలుగు: ‘‘బెంచికి ఒక్కరే కూర్చోవాలె. స్కూల్ అయితే క్లాసులో 20 మంది.. కాలేజీ అయితే 30 మందిని మాత్రమే కూర్చోబెట్టాలి. ఎక్కువమంది ఉంటే వేరే సెక్షన్లు పెట్టి క్లాసులు చెప్పాలె’’ నెల రోజుల క్రితం విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్ ఇచ్చిన గైడ్‌లైన్స్ ఇవీ. కానీ, వాటితో తమకేం సంబంధమన్నట్టు వ్యవహరిస్తన్నాయి కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు. కరోనా గైడ్ లైన్స్‌ను గాలికి వదిలేశాయి. బెంచికి ముగ్గురు, నలుగురు చొప్పున ఒక్కో క్లాసులో వంద మంది స్టూడెంట్స్‌ను కూర్చోబెడుతున్నాయి. విద్యాశాఖ అధికారులూ తమకేం పట్టనట్టు ఉంటున్నారు. దీనిపై ప్రశ్నించినా మేనేజ్మెంట్లు స్పందించట్లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు.
కాలేజీల వైపే చూడని ఆఫీసర్లు
సర్కారు, ప్రైవేటు స్కూళ్లలో కరోనా రూల్స్ పాటిస్తున్నారో లేదో పరిశీలించేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అబ్జర్వర్లనూ నియమించారు. అయితే, వాళ్లు కేవలం సర్కార్ స్కూళ్లు, కాలేజీల్లోనే పరిశీలన చేస్తున్నారు. కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లను పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఆ కాలేజీలు ఎలా నడుస్తున్నాయన్నది కూడా ఇంటర్ బోర్డు ఆఫీసర్లు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజూ రెండు సార్లు బెంచీలను, బాత్రూంలను క్లీన్ చేయాలన్న రూల్స్‌నూ మేనేజ్మెంట్లు పట్టించుకోవట్లేదు.
కల్యాణ మండపాల్లో కోచింగ్ సెంటర్లు!
కోచింగ్ సెంటర్లపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ స్కూళ్లు, కాలేజీలతో పాటు అవీ ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లో కల్యాణ మండపాల్లో కొన్ని కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. వందలాది మందికి క్లాసులు చెబుతున్నారు. విద్యా సంస్థల రీ ఓపెనింగ్‌పై ఇచ్చిన గైడ్‌లైన్స్‌లో ఎక్కడా వాటి పేరును సర్కారు ప్రస్తావించలేదు. దీంతో వాటికి పర్మిషన్ లేదని అధికారులు చెబుతున్నారు. నైన్త్ ఆపై క్లాసులకు అనుమతిచ్చారు కాబట్టి, తమకూ పర్మిషన్ వచ్చినట్టేనని నిర్వాహకులు అంటున్నారు.
చర్యలు తీసుకోవాలె
కోచింగ్ సెంటర్లకు సర్కార్ పర్మిషన్ ఇవ్వలేదు. అయినా మేనేజ్మెంట్లు ఓపెన్ చేశాయి. ఒక్కో హాల్లో వందల మందిని కుక్కి కోచింగ్ ఇస్తున్నాయి. బిల్డింగ్ సేఫ్టీ, శానిటరీ, కరోనా గైడ్లైన్స్ఇవేవీ పాటించడం లేదు. కార్పొరేట్ కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి. ప్రభుత్వం తనిఖీలు చేపట్టి రూల్స్ ఉల్లంఘించే ఇనిస్టిట్యూట్లపై చర్యలు తీసుకోవాలి.
– కేఎస్ ప్రదీప్, పీవైఎల్ స్టేట్ జనరల్ సెక్రటరీ
For More News..