పంట, చెట్ల వేస్ట్​ నుంచి సూపర్​ బొగ్గు తయారీ

పంట, చెట్ల వేస్ట్​ నుంచి సూపర్​ బొగ్గు తయారీ
  • మామూలు బొగ్గుతోపోలిస్తే నో పొల్యూషన్​
  • బయో డీజిల్ కు బదులుగాబయో ఆయిల్
  • కాలుష్య కారకాలకు చెక్ ..పర్యావరణం సేఫ్

మామూలుగా కరెంట్​ కోసం భూమి నుంచి బొగ్గును తవ్వి తీస్తున్నాం. భూమిలో సమాధి అయిన శిలాజాలు కొన్ని వందల ఏళ్లపాటు ఉండడం వల్ల ఆ బొగ్గు తయారవుతుంటుంది. కానీ, ఆ బొగ్గుతో వాతావరణానికి కలుగుతున్న ముప్పు, దాని వల్ల మనం ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు.

సముద్రాలు, భూమి లోలోతుల నుంచి ముడి చమురును వెలికి తీస్తున్నాం. దానిని రిఫైన్​ చేసి పెట్రోల్​, డీజిల్​, కిరోసిన్​, గ్యాస్​ వంటి వాటిని తయారు చేస్తున్నాం. వాటితో కలుగుతున్న ముప్పునూ మనం చూస్తూనే ఉన్నాం. వాటికి బదులుగా కొన్నేళ్ల కింది నుంచే బయోడీజిల్​పై దృష్టి పెట్టాం.

…మరి, వాటి వాడకానికి రీప్లేస్​మెంట్​ లేదా..? అంటే సైంటిస్టులు ఇప్పటిదాకా చెబుతున్నది కరెంట్​ బండ్లు, సోలార్​ పవర్​, విండ్​ పవర్​ అని అంటూ ఉంటారు. కానీ, చైనా సైంటిస్టులు మరో కొత్త మార్గాన్ని కనిపెట్టారు. అదే బయోకోల్​.. సమర్థమైన బయో ఆయిల్​. ఏంటీ బయోకోల్​, బయో ఆయిల్​..? వాటితో కలిగే లాభాలేంటి..? అసలు ఎట్లా తయారు చేస్తారు?

పంట, చెట్ల వేస్ట్​ నుంచి తయారీ

మామూలుగా కర్ర ముక్కలను కాలబెడితే బొగ్గు వస్తుంటుంది. కానీ, యూనివర్సిటీ ఆఫ్​ సైన్స్​ అండ్​ టెక్నాలజీ సైంటిస్టులు మాత్రం పంటలు, అడవుల్లోని చెట్ల వేస్ట్​తోనే ఈ బయోకోల్​ తయారు చేశారు. వడ్ల పొట్టు, వరి గడ్డి, గోధుమ గడ్డి, సోయాబీన్​ వేస్ట్, చెరుకు పిప్పి,  టింబర్​ డిపోల్లో మిగిలిపోయిన చెత్తను తీసుకొచ్చి 464 డిగ్రీల ఫారన్​హీట్​ దగ్గర బాగా వేడి చేశారు. ఫలితంగా బయో ఆయిల్​, బయో చార్​(బొగ్గు పొడి) వచ్చింది. బయోఆయిల్​ను మళ్లీ డిస్టిలేషన్​ చేసి డిస్టిల్డ్​ బయో ఆయిల్​ను, బయోకోల్​ను తయారు చేశారు. వడ్ల పొట్టు నుంచి తయారు చేసిన బొగ్గు వేడికి స్థిరంగా ఉందని గుర్తించారు. మామూలు శిలాజ బొగ్గుతో సమానంగా అది శక్తిని ఉత్పత్తి చేసినట్టు తేల్చారు. మామూలు బొగ్గులో ఉండే కాడ్మియం, లెడ్​, జింక్​, మాంగనీస్​ వంటి లోహాలేవీ బయో కోల్​లో ఉండవని చెబుతున్నారు. కాపర్​, నికెల్​ వంటి వాటి జాడ కూడా ఉండదన్నారు. కాబట్టి పర్యావరణానికి దీని నుంచి కలిగే ముప్పు ఏమీ ఉండదని చెబుతున్నారు.

తిండికి కొరత రాదు

ప్రస్తుతం బయో డీజిల్​ కోసం ప్రత్యేకంగా చెట్లను పెంచుతున్న సంగతి తెలిసిందే. దాని వల్ల పంట పొలాల్లో ఆహార ధాన్యాల సాగు తగ్గుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. పైగా ఆయా చెట్ల నుంచి తయారు చేస్తున్న బయో ఆయిల్స్​ త్వరగా ఆవిరైపోతాయని, వాటి పనితీరూ అంతంతమాత్రమేనని చెబుతున్నారు. కానీ, ఇలా పంట, చెట్ల వేస్ట్​ నుంచి తయారు చేసిన బయో ఆయిల్స్​తో అలాంటి నష్టాలేవీ ఉండవంటున్నారు. ఈ బయో ఆయిల్​ కోసం ప్రత్యేకంగా పంటను వేయాల్సిన అవసరం ఉండదని, పండించే ఆహార ధాన్యాల పంటల వేస్ట్​తోనే, ప్రత్యేకించి వరి వేస్ట్​తో బయో ఆయిల్​ను తయారు చేసుకుంటే, ఇటు ఆహార ధాన్యాల కొరత తీరుతుందని చెబుతున్నారు. మామూలు బయో ఆయిల్​తో పోలిస్తే ఈ బయో ఆయిల్​, చాలా బాగా పనిచేస్తుందని, శిలాజ ఇంధనాలతో పోలిస్తే బాగా మండుతుందని, కాలుష్య కారకాలేవీ విడుదల కావని అంటున్నారు. మామూలు బయో ఆయిల్స్​ కెమికల్​గా అంత స్థిరంగా ఉండవని, తక్కువ వేడి వద్ద మంచిగ మండవని చెబుతున్నారు. ఈ బయో ఆయిల్​ తక్కువ వేడి వద్ద కూడా బాగా మండి కావాల్సిన ఫలితాలిస్తాయంటున్నారు. అంతేగాకుండా 2030 నాటికి కార్బన్​ డయాక్సైడ్​ ఎమిషన్స్​ను ఏటా 73 కోట్ల టన్నులకు పైగా తగ్గించొచ్చని సూచిస్తున్నారు. ఈ పద్ధతిలో 2030 నాటికి ఏటా 40 కోట్ల టన్నుల బయో కోల్​ను తయారు చేస్తే, పెట్రోల్​, డీజిల్​, శిలాజ బొగ్గు వాడకాన్ని బాగా తగ్గించొచ్చని చెబుతున్నారు.