బొగ్గు గనుల్లో మూడు రోజుల పాటు దేశవ్యాప్త సమ్మె

బొగ్గు గనుల్లో మూడు రోజుల పాటు దేశవ్యాప్త సమ్మె

కోల్​బెల్ట్, వెలుగు : బొగ్గు పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల 11వ వేతన ఒప్పందానికి వ్యతిరేకంగా కోల్  ఇండియా  ఆఫీసర్స్ అసోసియేషన్​ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ  సింగరేణితో పాటు  దేశవ్యాప్తంగా బొగ్గు గనుల సమ్మెకు వెళ్లాలని ఐదు జాతీయ కార్మిక సంఘాలు ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నాయి. అక్టోబర్  5, 6, 7వ తేదీల్లో సమ్మె చేయాలని నిర్ణయించాయి. గురువారం జాతీయ స్థాయిలో జరిగిన కార్మిక సంఘాల సమావేశ వివరాలను  బీఎంఎస్​ స్టేట్​ ప్రెసిడెంట్ యాదగిరి సత్తయ్య, వర్కింగ్​ ప్రెసిడెంట్ పేరం రమేశ్, సీఐటీయూ జనరల్​ సెక్రటరీ మందా నర్సింహారావు వెల్లడించారు.  రాంచీలోని సీసీఎల్​ దర్భంగా హౌస్​లో బీఎంఎస్​, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, ఐఎన్టీయూసీ ప్రతినిధులు అత్యవసర సమావేశం జరిపారు. 11వ వేతన ఒప్పందంపై జబల్‌‌పూర్  హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చించారు. ఆఫీసర్స్​ అసోసియేషన్స్​ నిర్ణయంతో కార్మికులు, ఆఫీసర్ల మధ్య పారిశ్రామిక సంబంధాలు దెబ్బతిన్నాయని నిర్ధారణకు వచ్చారు. 

కేంద్ర ప్రభుత్వం, కోల్  ఇండియా మేనేజ్‌‌మెంట్ ఆఫీసర్ల  జీతాలు, సౌకర్యాలు, అలవెన్సులను పది సంవత్సరాలలోపు (2027 సంవత్సరం వరకు కాల పరిమితి) ముగియక ముందు పెంచినట్లయితే అన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకించాలని నిర్ణయించాయి. యాజమాన్యం మళ్లీ పేరివ్యూ అధికారులకు వర్తింపజేస్తే.. బొగ్గు గని కార్మికులకూ వర్తింపచేయాలని డిమాండ్​ చేశారు. ఇక నుంచి అధికారులతో బొగ్గు పరిశ్రమకు సంబంధించిన ఏ వేదికలోనూ కార్మిక సంఘాల ప్రతినిధులెవరూ పాల్గొనకూడదని ఏకభిప్రాయానికి వచ్చారు. ముందుగా నిర్ణయించిన కార్మికుల వేతనాలు, అలవెన్సులను నిలిపివేయాలని లేదా తగ్గించాలని కోల్  ఇండియా, సింగరేణి యాజమాన్యం  నిర్ణయం తీసుకుంటే దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమల్లో  అక్టోబర్​5, 6, 7వ తేదీల్లో సమ్మె చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 

సమ్మె విజయవంతానికి నేతలు పిలుపునిచ్చారు. సమ్మె విషయాన్ని కోల్  ఇండియా  చైర్మన్, సింగరేణి సీఎండీకి నోటీసులు పంపారు. ఈ నోటీసులో కొత్తకాలపు  లక్ష్మారెడ్డి, మజ్రుల్  హక్  అన్సారీ (బీఎంఎస్​),  కుమార్ జైమంగల్, ఏకే ఝా(ఐఎన్‌‌టీయూసీ), నాథూలాల్ పాండే, ఆర్‌‌బీ రాధవం (హెచ్ఎంఎస్), రామేంద్ర కుమార్ (ఏఐటీయూసీ), అశోక్ యాదవ్, డీడీ రామానందన్, ఆర్‌‌పీ సింగ్(సీఐటీయూ)  సంతకాలు చేశారు.