కోబ్రా.. లెక్క తప్పింది

కోబ్రా.. లెక్క తప్పింది

వెర్సటైల్ యాక్టింగ్‌కి కేరాఫ్ విక్రమ్. ఇంటెలిజెంట్ టేకింగ్‌లో ఎక్స్ పర్ట్ అజయ్ జ్ఞానముత్తు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే ఎలా ఉంటుందో ఊహించవచ్చు. ‘కోబ్రా’పై భారీ అంచనాలు ఏర్పడానికి కారణం అదే. తమిళ, తెలుగు భాషల్లో నిన్న విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా లేదా? ఎప్పటి నుంచో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న విక్రమ్‌ ఆశని నెరవేర్చిందా లేదా? చూద్దాం.

కథేమిటంటే..

మధి (విక్రమ్) మ్యాథ్స్ జీనియస్. చెన్నైలో ఉంటాడు. పక్కింట్లో ఉండే ప్రొఫెసర్ (శ్రీనిధి) తనని ప్రేమిస్తున్నా అవాయిడ్ చేస్తుంటాడు. మరోవైపు స్కాట్లాండ్ యువరాజుతో పాటు ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన రాజకీయ నాయకులు హత్యకు గురవుతుంటారు. ఈ కేసును ఇంటర్‌‌పోల్ ఆఫీసర్ అస్లాన్‌ (ఇర్ఫాన్ పఠాన్‌)కి అప్పగిస్తుంది ప్రభుత్వం. హంతకుడిని పట్టుకునే క్రమంలో ఇండియాలోని ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా ఇదే తరహాలో చంపినట్టు తెలుస్తుంది. దాంతో తీగ లాగుతూ ఇండియా చేరుకుంటాడు ఆఫీసర్. ఈ నేరాలన్నింటినీ కోబ్రాయే కారణమని తెలుసుకుంటాడు. ఆ కోబ్రా ఎవరో కాదు, మధియేననని కనిపెడతాడు. అతని అనుమానం నిజమేనా, మధియే ఈ హత్యలు చేశాడా, చేస్తే ఎందుకు చేశాడు అనేది మిగతా కథ.  

ఎలా ఉందంటే..

చెప్పుకోడానికి ఈ లైన్ చిన్నదే. అజయ్ జ్ఞానముత్తు ఎప్పుడూ సింపుల్‌ లైన్సే తీసుకుంటాడు. కానీ అతని స్క్రీన్‌ప్లే మాత్రం ఎప్పుడూ సింపుల్‌గా ఉండదు. చిన్న కథాంశానికి టిపికల్ కథనాన్ని జోడించి బెస్ట్ థ్రిల్లర్స్ని క్రియేట్ చేస్తాడు తను. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం అలా జరగలేదు. హత్యలు, ఇన్వెస్టిగేషన్‌తో చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది కథ. చక్కని మలుపులతో ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తుంది. ఇద్దరు విక్రమ్‌లు ఉన్నారా లేక ఒకడే ఇద్దరిలా బిహేవ్ చేస్తున్నాడా అనే డౌట్ రెయిజ్ చేసి క్యూరియాసిటీని పెంచుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ సూపర్బ్ గా అనిపిస్తుంది. అయితే ఆ తర్వాతే మొదలైంది అసలు సమస్య. స్క్రీన్‌ ప్లే బలంగా లేకపోవడం వల్ల కథ తేలిపోవడంతో పాటు కన్‌ఫ్యూజన్ మొదలవుతుంది. క్యారెక్టరైజేషన్స్ కూడా కాస్త వీక్ అయినట్టు అనిపించడంతో విసుగు మొదలవుతుంది. ఇక ఫ్లాష్‌ బ్యాక్‌ అయితే ప్రేక్షకుల ఓర్పుకు పరీక్ష పెడుతుంది. ఎప్పటికి అవుతుందా అనిపిస్తుంది. ద్వితీయార్థం మొత్తం ఇలాంటి నిరాశ చాలాచోట్ల కలుగుతుంది. క్లైమాక్స్ లో యాక్షన్ సీన్స్ బాగున్నప్పటికీ బెస్ట్ మూవీ చూసిన ఫీలయితే కలగదు. 

నిజానికి చాలా డెప్త్ కి వెళ్లే అవకాశం ఉన్న కథ ఇది. హీరో పాత్రలో ఒక పెయిన్ ఉంటుంది. కానీ ఆ ఎమోషన్‌ని సరిగ్గా క్యారీ చేయలేకపోవడమే మైనస్ అయ్యింది. మెయిన్ క్యారెక్టర్స్ మధ్య మంచి కాన్‌ఫ్లిక్ట్ పెట్టలేదు. ఇలాంటి సినిమాల్లో ఊహకు అందని ట్విస్టులు ఆశిస్తారు ఆడియెన్స్. ఏవో కొన్ని తప్ప అలాంటివి పెద్దగా కనిపించవు. హీరోది డ్యూయెల్ రోల్ అయినప్పుడు ఆ క్యారెక్టరయిజేషన్స్ పై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. మరింత ఎఫెక్టివ్‌గా సీన్లు రాసుకోవాలి. అలా జరగకపోవడం ఈ సినిమాకి మరో పెద్ద మైనస్. ఇంటర్వెల్ తర్వాత డ్రామా మరీ ఎక్కువవడం, నేరేషన్ బాగా స్లో అవడంతో థ్రిల్ మిస్సయ్యింది. కొన్ని చోట్ల లాజిక్‌ని కూడా గాలికి వదిలేయడంతో ఆ సీన్స్ మీనింగ్‌లెస్‌గా అనిపిస్తుంటాయి. సినిమా నిడివి మూడు గంటల కంటే ఎక్కువ కావడంతో విసుగు పీక్స్కి వెళ్తుంది. దాంతో ఏం ఉందిరా అనాల్సిన సినిమా కాస్తా ఏదో ఉందిలే అని సరిపెట్టకోవాల్సినట్టు తయారయ్యింది. 

ప్లస్సులూ... మైనస్సులూ

విక్రమ్ నటించిన ఏ సినిమాకైనా మొదటి ప్లస్ అతనే అవుతాడు. ఎందుకంటే వంక పెట్టలేని నటన తనది. ఇందులోనూ తన నటనాస్థాయి ఏంటో చూపించాడు. పది రకాల గెటప్స్ లో కనిపించి మెప్పించాడు. హెల్యూసినేషన్‌కి గురైన సమయంలో అతని నటనను చూసి తీరాల్సిందే. అయితే తను గతంలో ఇలాంటి యాక్షన్ చేసేశాడు. అపరిచితుడు, ఇంకొక్కడు సినిమాల్లో చూసేశాం. అందుకే కొత్తగా అనిపించదు. అలా అని తన నటనకు మనసు ఫిదా అవ్వకుండానూ ఉండదు. పది గెటప్స్ లో  కొన్ని కృతకంగా అనిపించినా, ‘దశావతారం’ సినిమాని గుర్తు చేసినా.. కొన్ని గెటప్స్ లో  మాత్రం సూపర్‌‌ అనిపించాడు. ఆ తర్వాత చెప్పుకోదగ్గ పాత్ర ఇర్ఫాన్ పఠాన్‌ది. బేసిగ్గా క్రికెటరే అయినా అనుభవమున్న నటుడిలా చేశాడు. లుక్స్ పరంగానూ బాగున్నాడు. కొన్నిచోట్ల ఇంకా బాగా చేసి ఉండాల్సింది అనిపించినా.. ఓవరాల్‌గా శాటిస్‌ఫై చేశాడనే చెప్పాలి. శ్రీనిధి పరిధి మేరకు బానే చేసింది. మృణాళిని పాత్ర కూడా ఫర్వాలేదు. విలన్‌గా రోషన్ మాథ్యూ అదరగొట్టాడు. 

టెక్నికల్ అంశాల విషయానికొస్తే ఈ చిత్రానికి రెహమాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్సయ్యింది. ఓ థ్రిల్లర్‌‌కి ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలనేది ఆయనకి ప్రత్యేకంగా ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. పాటలు ఎంత బాగా చేశాడు అంతకు మించి నేపథ్య సంగీతం ఇచ్చాడు. సినిమాపై తన ముద్ర వేశాడు. హరీష్ కణ్ణన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ భువన్ తన కత్తెరకు మరింత పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. కాకపోతే దర్శకుడు కథనం విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉండాల్సింది. విక్రమ్ లాంటి విలక్షణ నటుణ్ని ఫిల్మ్ మేకర్స్ సరిగ్గా ఉపయోగించుకోవడం లేదనే మాట నిజమేనని అజయ్ మరోసారి ప్రూవ్ చేశాడు. పది రకరాల గెటప్స్లో విక్రమ్‌ పూర్తి స్థాయిలో పర్‌‌ఫార్మ్ చేసే అవకాశమున్న సినిమా ఇది. పైగా హెల్యూసినేషన్‌ లాంటి సెగ్మెంట్స్ ఉన్నప్పుడు విక్రమ్ నటన ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. అలాంటప్పుడు బిగి సడలని స్క్రీన్‌ ప్లే, బలమైన సన్నివేశాలు అవసరం. డిమాంటీ కాలనీ, అంజలి సీబీఐ లాంటి సినిమాలు తీసిన అజయ్‌కి ఆ విషయం తెలియదని కాదు. కానీ ఈసారి అతను బాగా తడబడ్డాడనేది మాత్రం వాస్తవం. తన మార్క్‌ స్క్రీన్‌ ప్లే కనుక ఉండి ఉంటే ‘కోబ్రా’ కచ్చితంగా బెస్ట్ మూవీ అయ్యుండేది. అలా జరగకపోవడం ల్ల సినిమాల సెలెక్షన్‌లో విక్రమ్‌ మరింత అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని మరోసారి గుర్తు చేసినట్టయ్యింది. 

నటీనటులు: విక్రమ్, శ్రీనిధి శెట్టి, మృణాళినీ రవి, ఇర్ఫాన్ పఠాన్, కేఎస్ రవికుమార్, మియా జార్జ్, రోషన్ మాథ్యూ తదితరులు

సంగీతం: రెహమాన్

నిర్మాణం: లలిత్ కుమార్

కథ, కథనం, దర్శకత్వం: అజయ్ జ్ఞానముత్తు