
- హిందుస్తాన్ కోకకోలా బెవరేజెస్‌ను మార్కెట్‌లో లిస్ట్ చేయనున్న కంపెనీ
న్యూఢిల్లీ: అమెరికన్ కంపెనీ కోకకోలా తన ఇండియన్ బిజినెస్‌ను మార్కెట్‌లో లిస్ట్ చేయాలని చూస్తోంది. బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ ప్రకారం, ఈ ఐపీఓ ద్వారా సుమారు రూ.8,800 కోట్లు (ఒక బిలియన్ డాలర్లు) సేకరించనుంది. కోకకోలా ఇండియన్ కంపెనీ హిందుస్తాన్ కోకకోలా బెవరేజెస్ వాల్యుయేషన్‌ను 10 బిలియన్ డాలర్లుగా లెక్కించారు.
ఇటీవల మర్చంట్ బ్యాంకర్లతో చర్చలు జరిగినప్పటికీ, ఇంకా అధికారికంగా ఎవరినీ నియమించలేదు. ఐపీఓ 2026లో జరగొచ్చని అంచనా. ఇప్పటికే సౌత్ కొరియన్ కంపెనీలు ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్, హ్యుందాయ్ మోటార్స్ తమ ఇండియన్ బిజినెస్‌లను మార్కెట్‌లో లిస్టింగ్ చేసి భారీగా ఫండ్స్ సేకరించిన విషయం తెలిసిందే. ఎల్‌జీ 1.3 బిలియన్ డాలర్లు, హ్యుందాయ్ 3.3 బిలియన్ డాలర్లను ఐపీఓ ద్వారా సేకరించాయి.
భారత్ కోకకోలాకి కీలక మార్కెట్ అయినప్పటికీ, రిలయన్స్ తీసుకొచ్చిన కాంపా కోలాతో పోటీ పెరిగింది. కాంపా కోలా 200 ఎంఎల్‌ను రూ.10కే అమ్ముతూ బెవరేజెస్ సెగ్మెంట్‌లో రిలయన్స్ వేగంగా తన మార్కెట్ వాటాను పెంచుకుంటోంది. కాగా, ఇటీవల కోకకోలా గ్లోబల్, జూబిలంట్ భారతీయ గ్రూప్‌కి హిందుస్తాన్ కోకకోలాలో కొంత వాటాను విక్రయించిన విషయం తెలిసిందే.
కోకకోలా భారత మార్కెట్లో తన బిజినెస్‌ను విస్తరించడానికి, ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పొందడానికి ఈ ఐపీఓ సాయపడొచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు. ఐపీఓ టైమింగ్, సైజ్‌పై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి.