వెలుగు ఓపెన్ పేజీ.. దేశాన్ని షేక్ చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ

వెలుగు ఓపెన్ పేజీ.. దేశాన్ని షేక్ చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ

“కాక్రోచ్ జనతా పార్టీ”  ఏమైనా కొత్త రాజకీయ పార్టీనా? లేక నిజంగానే ఎన్నికల్లోకి రాబోతుందా? అనే సందేహాలు చాలామందిలో కలిగాయి. కానీ తర్వాత ఇది యువత అసంతృప్తి, నిరుద్యోగం, రాజకీయ వ్యవస్థపై వ్యంగ్యంగా మొదలైన డిజిటల్ ఉద్యమమని స్పష్టమైంది.  భారత  ప్రధాన  న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌‌‌‌ నిరుద్యోగ యువతను ఉద్దేశిస్తూ “కాక్రోచ్​లు” అనే పదం ఉపయోగించారని  యువతలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. తర్వాత ఆయన తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చినా,  అప్పటికే  సోషల్ మీడియా ఈ అంశాన్ని పెద్ద ఎత్తున చర్చలోకి తీసుకువచ్చింది.

ఇది రాజకీయ ఉద్యమంగా మారేనా?

ఈ నేపథ్యంలో అమెరికాలో నివసిస్తున్న అభిజీత్ దిప్కే అనే వ్యక్తి  సోషల్ మీడియాలో “అన్ని కాక్రోచ్​లు ఒక్కటైతే?” అనే భావంతో ఒక వ్యంగ్య పోస్టు పెట్టాడు. అదే “కాక్రోచ్​ జనతా పార్టీ” అనే పేరుతో వైరల్ కావడం ప్రారంభమైంది.  ప్రస్తుతం ఈ “కాక్రోచ్​ జనతా పార్టీ”కి  అధికారిక  రాజకీయ పార్టీ హోదా లేదు. ఎన్నికల కమిషన్‌‌‌‌లో నమోదు కూడా కాలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఇదొక ప్రతీకగా మారింది.  ముఖ్యంగా నిరుద్యోగం, పరీక్షల లీకులు, ఉద్యోగాల కొరత, పెరుగుతున్న జీవన వ్యయాలు, రాజకీయ నాయకుల నిర్లక్ష్యం వంటి అంశాలపై యువతలో ఉన్న అసంతృప్తి ఈ ట్రెండ్ ద్వారా బయటపడుతోంది.  

సోషల్ మీడియా యుగంలో యువత తమ అసంతృప్తిని వ్యక్తపరచే పద్ధతి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మీమ్స్, వైరల్ హ్యాష్‌‌‌‌ట్యాగ్స్, వ్యంగ్య రూపంలో ‘‘కాక్రోచ్​ జనతా పార్టీ’’ డిజిటల్ ప్రతిస్పందనగా మారింది. ఇది నిజంగా రాజకీయ ఉద్యమంగా మారుతుందా? లేక కొద్దిరోజుల సోషల్ మీడియా ట్రెండ్‌‌‌‌గా మిగిలిపోతుందా? అనేది తరువాత విషయం. కానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా యువత చర్చిస్తున్న అత్యంత వైరల్ డిజిటల్ రాజకీయ వ్యంగ్య ఉద్యమాల్లో “కాక్రోచ్​ జనతా పార్టీ” మాత్రం ఒకటి! 

- శ్రీనివాస్ గౌడ్ ముద్దం, సోషల్​ ఎనలిస్ట్​