ఆర్డినరీ బస్సుకు బోర్డు మార్చి అదనపు బాదుడు

ఆర్డినరీ బస్సుకు బోర్డు మార్చి అదనపు బాదుడు
  • టికెట్ తీసుకునే ముందు తెలిసి షాకవుతున్న ప్యాసింజర్లు  
  • అనేక చోట్ల కండక్టర్లతో జనం వాగ్వాదం  
  • ఇదేం బాదుడంటూ ప్యాసింజర్ల ఆవేదన  

వరంగల్ ప్రతినిధి, వెలుగు:  బస్సును, దానికున్న రంగును, దానిపైన పల్లె వెలుగు అనే పేరును చూసి ఎక్కిన ప్రయాణికులు తీరా టికెట్ తీసుకునేటప్పుడు షాకవుతున్నారు. ఇది పల్లె వెలుగు బస్సు కాదని.. ఎక్స్ ప్రెస్ బస్సు అంటూ కండక్టర్లు ఎక్స్ ప్రెస్ చార్జీలు వసూలు చేస్తున్నారు. బస్సు కదిలాక విషయం తెలియడంతో మధ్యలో దిగలేక జనం ఉసూరుమంటూ డబ్బులు ఇచ్చేసి టికెట్ తీసుకుంటున్నారు. చాలా మంది ప్యాసింజర్లు కండక్టర్లతో వాగ్వాదాలకు కూడా దిగుతున్నారు. ఇప్పటికే ప్రయాణికులపై ఆర్టీసీ వరుసబెట్టి సెస్‌‌‌‌లు, రౌండ్‌‌‌‌ ఫిగర్‌‌‌‌ పేరుతో చార్జీల మోత మోగించింది. మూడు నెలల్లో ఏకంగా ఆరు సార్లు చార్జీలను పెంచింది. 30 శాతం నుంచి 50 శాతం వరకు పెరిగిన చార్జీలతో అవస్థలు పడుతున్న జనాల నుంచి మరింత పిండేందుకు ఆర్టీసీ అధికారులు ఇలా కొత్త మార్గాలు వెతకడంపై విమర్శలు వస్తున్నాయి. 

పల్లె వెలుగు సర్వీసులు తగ్గింపు 

వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు గ్రామీణ ప్రాంతాల వారు ఆశ్రయించే పల్లె వెలుగు బస్సులను ఆర్టీసీ యాజమాన్యం క్రమంగా తగ్గిస్తోంది. పల్లె వెలుగు బస్సులకు ఎక్స్ ప్రెస్ బోర్డులు తగిలించి ఎక్స్ ప్రెస్ చార్జీలు వసూలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 11 రీజియన్లలోని  97 డిపోల్లో మొత్తం 9,734 బస్సులు ఉండగా, వాటిలో పల్లె వెలుగు బస్సులు 3,524 మాత్రమే. ఇందులోనూ 1,723 అద్దె బస్సులే ఉన్నాయి. ఇప్పటికే తక్కువగా ఉన్న పల్లె వెలుగు బస్సులకు ఇలా ఎక్స్​ప్రెస్​ బోర్డులు తగిలించి నడుపుతుండడంతో వీటి సంఖ్య మరింత పడిపోయింది. ప్రస్తుతం వీటిలో ఎక్కువగా అద్దె బస్సులే ఉన్నట్లు తెలిసింది. దీంతో ఉన్నంతలో తక్కువ చార్జీలతో కూడిన ప్రయాణం ప్యాసింజర్లకు అందకుండా పోతోంది. అలాగే పెరిగిన చార్జీల భారం భరించలేక గతంలో ఎక్స్ ప్రెస్ ఎక్కేవాళ్లు కూడా కాస్త తక్కువ చార్జీ ఉంటుందని పల్లె వెలుగు బస్సు ఎక్కి షాకవుతున్నారు. ఇదేం బాదుడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

పొద్దున పల్లె వెలుగు.. మధ్యాహ్నం ఎక్స్ ప్రెస్ 

కాలేజీలు, స్కూళ్లకు వచ్చే స్టూడెంట్లు బస్ పాస్ లు తీసి ఉండడంతో వారి కోసం ఉదయం పల్లె వెలుగు బస్సులను కొన్ని రూట్లలో నడుపుతున్నారు. ఉదయం 10 గంటల వరకు సమీపంలోని పట్టణాలు, నగరాలకు చేరుకున్న తర్వాత.. వాటినే ఎక్స్ ప్రెస్ సర్వీసులుగా బోర్డులు మార్చి నడుపుతున్నట్లు వరంగల్ ‌‌– 2 డిపోకు చెందిన ఓ కండక్టర్ వెల్లడించారు. ఎక్స్ ప్రెస్ సర్వీస్ లే అయినా మధ్యలో ఎక్కడైనా చిన్న స్టేజీల్లో దిగేవాళ్లుంటే ఆపాల్సి వస్తోందని, ఇలా ఆపిన చోట మిగతా ప్యాసింజర్లు గొడవ చేస్తున్నారని తెలిపారు. ఆర్టీసీ అధికారులు టార్గెట్లు పెట్టడంతో అన్నీ భరిస్తూ డ్యూటీ చేయాల్సి వస్తోందన్నారు.