వసంత పంచమి వేడుకలకు ఏర్పాట్లు పూర్తిచేయాలి : కలెక్టర్ అభిలాష అభినవ్

వసంత పంచమి వేడుకలకు ఏర్పాట్లు పూర్తిచేయాలి : కలెక్టర్ అభిలాష అభినవ్

బాసర, వెలుగు: బాసరలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు వైభవంగా నిర్వహించే వసంత పంచమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ఆలయంలో వసంత పంచమి వేడుకల ఏర్పాట్లపై ఆలయ కార్యనిర్వాహక అధికారి కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే రామారావు పటేల్ తో కలిసి అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏర్పాట్ల వివరాలను శాఖల వారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలన్నారు.

రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దర్శనానికి అనుమతించాలని, భక్తులకు సరిపడినంత ప్రసాదాన్ని అందుబాటులో ఉంచాలని సూచించారు. క్యూలైన్లలో చిన్నపిల్లలకు పాలు, పండ్లు అందించాలన్నారు. తాగునీరు, బయోటాయ్​లెట్స్ ఏర్పాటు చేయాలన్నారు.  వైద్య శిబిరం ఏర్పాటు చేసి డాక్టర్లు, అత్యవసర మందుల్ని అందుబాటులో ఉంచాలన్నారు. హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాలని సూచించారు.  భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే రామారావు పటేల్​ఆదేశించారు. అక్షరాభ్యాస కార్యక్రమాలకు ఇబ్బందులు కలగకుండా తగినంత మంది పురోహితులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. సమావేశంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్, దేవాలయ ఏఈవో సుదర్శన్ గౌడ్, సర్పంచ్ వెంకటేశ్ గౌడ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.