అర్హులందరికీ పథకాలు అందేలా చర్యలు : కలెక్టర్ అభిలాష

అర్హులందరికీ పథకాలు అందేలా చర్యలు :  కలెక్టర్ అభిలాష

ఖానాపూర్, వెలుగు: అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. గురువారం ఖానాపూర్ ఎంపీపీ కార్యాలయ సమావేశ మందిరంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తో కలిసి ఖానాపూర్ నియోజకవర్గానికి సంబంధించి వివిధ అభివృద్ధి పనులు, పథకాల అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిర్మాణంలోని అభివృద్ధి పనుల్లో అలసత్వం వహిస్తే కాంట్రాక్టర్​ను మారుస్తామని హెచ్చరించారు. 

ఎమ్మెల్యే బొజ్జు పటేట్​మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను పేదలకు చేరవేయడమే తమ లక్ష్యమన్నారు. వాటి అమలులో అధికారులు నిర్లక్ష్యం వహించొద్దని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఇండ్ల నిర్మాణానికి అటవీ భూముల సమస్య ఉన్నచోట పరిష్కారానికి సంబంధిత అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు. 

అభివృద్ధి పనులకు అదనంగా నిధులు అవసరమైతే ప్రభుత్వంతో మాట్లాడి, మంజూరు చేసేలా చూస్తానన్నారు. అనంతరం అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాలకు సంబంధించిన వాల్​పోస్టర్​ఆవిష్కరించారు. ఖానాపూర్ తహసీల్దార్ ఆఫీస్​ నూతన భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అడిషనల్​కలెక్టర్లు పైజాన్ అహ్మద్, కిశోర్ కుమార్, డీఎఫ్ వో నాగినిభాను, ఆర్డీవో రత్నకల్యాణి, మండల ప్రత్యేక అధికారి జీవరత్నం, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ భూషణ్, అబ్దుల్ మాజీద్, తహసీల్దార్ సుజాత రెడ్డి, కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు దొనికేని దయానంద్, నీమ్మల రమేశ్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. 

యువజన ఉత్సవాలు ప్రారంభం

నిర్మల్, వెలుగు: విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభ, నైపుణ్యాలను వెలికితీయడానికి యువజన ఉత్సవాలు దోహదపడతాయని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్​పట్టణంలోని ఎన్‌‌‌‌టీ‌‌‌‌ఆర్ మినీ స్టేడియంలో జిల్లాస్థాయి యువజన ఉత్సవాలను ఆమె గురువారం ప్రారంభించారు. 

యవ్వన దశలో ఎటువంటి వ్యసనాలకు లోనుకాకుండా స్పష్టమైన లక్ష్యాన్ని పెట్టుకోవాలని, దాన్ని సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. ఉత్సవాలను లోటుపాట్లు లేకుండా సమర్థంగా నిర్వహించాలని, ప్రతీ విద్యార్థి పాల్గొనే అవకాశాన్ని కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం విద్యార్థులు రూపొందించిన నమూనాలను పరిశీ లించి అభినందించారు. డీఈవో భోజన్న, డీవైఎస్ వో శ్రీకాంత్ రెడ్డి, డీపీఆర్వో విష్ణువర్ధన్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, పలు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.