
మహబూబాబాద్, వెలుగు: జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కోరారు. మంగళవారం కలెక్టర్ డోర్నకల్, కురవి మండలాల్లో పర్యటించారు. బలపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి, రికార్డులు, ఇతర వివరాలను పరిశీలించారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. మన్నెగూడెం జడ్పీ హై స్కూల్ ను ఆకస్మికంగా సందర్శించి, ఏఐ బోధన, సబ్జెక్టులపై విద్యార్థుల పరిజ్ఞానాన్ని తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లను పెంచాలన్నారు. వెన్నారం అప్పర్ ప్రైమరీ స్కూల్‌ను సందర్శించి, వసతులు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పర్యటనలో డీఈవో ఏ.రవీందర్ రెడ్డి, ఇతర అధికారులున్నారు.
కురవి మండలం బలపాల గ్రామంలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆయిల్‌పామ్ ప్లాంటేషన్ మెగా మేళాలో కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో పామ్ఆయిల్ సాగు పెంచాలని అన్నారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి మరియన్న మాట్లాడుతూ ప్రతి రైతు పొలం గట్ల మీద, పొలం చుట్టూ, పెరట్లో, ఆయిల్ పామ్, పండ్ల తోటలలో అంతర పంటలుగా, డాబాలపై కూరగాయలను సాగు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ శ్రీనివాస్, ఏవో నరసింహ రావు తదితరులు పాల్గొన్నారు.