దివ్యాంగుల అభ్యున్నతికి పటిష్ట కార్యాచరణ అమలు : కలెక్టర్ అనుదీప్

దివ్యాంగుల అభ్యున్నతికి పటిష్ట కార్యాచరణ అమలు :  కలెక్టర్ అనుదీప్
  • అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ అనుదీప్​

ఖమ్మం టౌన్, వెలుగు :  జిల్లాలో దివ్యాంగుల అభ్యున్నతికి పటిష్ట కార్యాచరణ అమలు చేస్తున్నామని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల కారణంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను నెలరోజులు ఆలస్యంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. 

సంక్షేమ కార్యక్రమాల అమలులో ఖమ్మం జిల్లా యంత్రాంగం ముందంజలో ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం జిల్లా స్థాయి ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేసి, దివ్యాంగులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి విజేత, డీఎంహెచ్‌ఓ డా. వేణుమాధవ్, డి.హెచ్.ఈ.డబ్ల్యూ సమ్రీన్ మరియు దివ్యాంగ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. 

17న ఒడ్డె ఓబన్న జయంతి వేడుకలు..

జనవరి 11న ఉదయం 9 గంటలకు కలెక్టరేట్‌లో ఒడ్డె ఓబన్న జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ జయంతి వేడుకలకు ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ కుల సంఘాల నాయకులు మరియు ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వం తరఫున నిర్వహించే ఈ వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

అందుబాటులో యూరియా.. 

జిల్లాలో ప్రస్తుతం 10,552 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, ఎక్కడా ఎరువుల కొరత లేదని కలెక్టర్ అనుదీప్​ గురవాఉంర ఒక ప్రకటనలో తెలిపారు. రైతులకు సకాలంలో యూరియా పంపిణీ చేసేందుకు అన్ని మండలాల్లో సమగ్ర చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.