‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ను పకడ్బందీగా అమలు చేయాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ను పకడ్బందీగా అమలు చేయాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం టౌన్, వెలుగు : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు వంద శాతం ఇంగ్లిష్ పఠనా సామర్థ్యం ఉండాలనే ఉద్దేశంతో రూపొందించిన ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. గురువారం స్థానిక భక్తరామదాసు కళాక్షేత్రంలో అడిషనల్ కలెక్టర్ పి. శ్రీజ, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, విద్యాశాఖ అధికారులు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులతో ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు.

 ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల రీడింగ్ స్కిల్స్ పెంచేందుకు టీచర్లు కృషి చేయాలన్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి చదివే పిల్లలకు ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్లు భాగస్వామ్యం కావాలని సూచించారు. 

ఈసీఆర్ ప్రారంభించిన మొదటి వారం నుంచి విద్యార్థుల హాజరు శాతం పెరిగిందని, ఇది పిల్లలకు జీవితకాలం ఉపయోగపడే సామర్థ్యాన్ని అందిస్తుందనితెలిపారు. రెండవ దశ ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం అమలులో పదాలు చదివే సామర్థ్యం ఉన్న పిల్లలు వ్యాఖ్యలు చదివేలా, అక్షరాలను చదివే పిల్లలు పదాలు చదివేలా కృషి చేయాలని తెలిపారు.

 అనంతరం ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమంలో మంచి ప్రతిభ కనబర్చిన హెచ్​ఎం, మండల విద్యాశాఖ అధికారులను కలెక్టర్ సన్మానించారు. అంతకుముందు కలెక్టరేట్ లోని జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. 

ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి..

ఖమ్మం రూరల్, వెలుగు: మున్సిపల్​ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం రూరల్ మండల ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఏదులాపురం మున్సిపాలిటీ వార్డుల నామినేషన్ స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ పత్రాలను పరిశీలించారు.