
- 3కె రన్ ను ప్రారంభంలో ఖమ్మం కలెక్టర్ అనుదీప్
ఖమ్మం టౌన్, వెలుగు : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి జిల్లాకు గుర్తింపు తీసుకురావాలని, ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. స్థానిక సర్ధార్ పటేల్ స్టేడియంలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. సర్ధార్ పటేల్ స్టేడియంలో భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటిన హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని సందర్భంగా ఆయన ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను కలెక్టర్ సన్మానించి, జ్ఞాపికలు అందించారు. వివిధ క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ఇచ్చారు. క్రీడా రంగానికి ధ్యాన్‌చంద్ చేసిన సేవలు మరువలేనివని కలెక్టర్ కొనియాడారు. బ్యాడ్మింటన్ ఇన్ డోర్ స్టేడియంలో యునెక్స్ సన్ రైజ్ 11వ తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్ బాలబాలికల బాట్మ్ మెంట్ చాంపియన్ షిఫ్ ఫొటీలను కలెక్టర్ ప్రారంభించారు.
అంతకుముందు 3కె రన్ ను సర్ధార్ పటేల్ స్టేడియం వద్ద అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఇల్లెందు క్రాస్ రోడ్, జిల్లా కోర్టు, ఇందిరనగర్ సెంటర్ నుంచి జడ్పీ సెంటర్ మీదుగా ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సునీల్ రెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.