ఒక్క ప్రాణం కూడా పోకూడదు.. వరద తీవ్రత ఎంతైనా ఎదుర్కోవాలి

ఒక్క ప్రాణం కూడా పోకూడదు.. వరద తీవ్రత ఎంతైనా ఎదుర్కోవాలి
  • భద్రాచలంలో గోదావరి ఫ్లడ్స్​పై కలెక్టర్ అనుదీప్ రివ్యూ
  • ఫ్లడ్ మేనేజ్​మెంట్ ప్లాన్​రెడీ చేయాలని అన్నిశాఖలకు ఆదేశం
  • క్షేత్ర స్థాయిలో పర్యటించి కరకట్ట స్లూయిజ్​ల పరిశీలన ​

భద్రాచలం/ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భారీ వర్షాలు కురిసి గోదావరి వరద ముంచెత్తితే, ఈసారి ఒక్క ప్రాణం కూడా పోకూడదని భద్రాద్రికొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చెప్పారు. వరద తీవ్రత ఎలా ఉన్నా, ఎదుర్కునేందుకు రెడీగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఫ్లడ్ మేనేజ్​మెంట్ ప్లాన్ రెడీ చేయాలన్నారు. భద్రాచలం ఆర్డీఓ ఆఫీసులో మంగళవారం అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ గోదావరి వరదలపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. వరద తీవ్రతను బట్టి ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేలా ముందస్తుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ప్రతి ఊరు నుంచి సహాయక చర్యల్లో పాల్గొనేలా చూడాలన్నారు. లైఫ్​జాకెట్లు, గజ ఈతగాళ్లు, బోట్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. 5 నెలలకు సరిపడా నిత్యావసరాలు నిల్వ చేయాలన్నారు.

ముంపు చర్యల పర్యవేక్షణకు సెక్టోరియల్, జోనల్ ఆఫీసర్లను నియమిస్తున్నట్లు వెల్లడించారు. 70 అడుగుల వరద వచ్చినా నిరంతరం విద్యుత్ సరఫరా చేసేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పంచాయతీరాజ్, ట్రాన్స్ కో ఆఫీసర్లు ముంపు గ్రామాల్లో పర్యటించి పరిశీలించాలన్నారు. ముంపు గ్రామాల్లో గర్భిణులు ఉంటే గుర్తించి ముందుగా ఆసుపత్రులకు తరలించాలని, మందులు, అంబులెన్సులు, ఆర్బీఎస్​కే వెహికల్స్​సిద్ధంగా ఉంచాలని డీఎంహెచ్ఓ శిరీషకు సూచించారు.  భద్రాచలం రామాలయం వద్ద ఉన్న విస్తా కాంప్లెక్స్ ఏరియాలో మురుగునీరు తోడేందుకు 500 హార్స్ పవర్ మోటార్లను రెడీగా ఉంచాలని, అవసరమైతే అదనంగా అందించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. గోదావరి కరకట్టపై ఉన్న స్లూయిజ్​ల లీకేజీలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భద్రాచలం ఆర్డీఓ ఆఫీసులో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూం, మండల, జిల్లా స్థాయిల్లోనూ ఏర్పాటు చేయాలన్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లితే ఎక్కడికక్కడ బారికేడింగ్ ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్​ ఇంజనీర్లను ఆదేశించారు.

అవసరమైతే సింగరేణి, కేటీపీఎస్, ఐటీసీ, నవభారత్​ సంస్థల నుంచి రెస్క్యూ టీంలను రప్పించాలన్నారు. ఎన్డీఆర్​ఎఫ్ తోపాటు ఎస్డీఆర్ఎఫ్​ టీంలను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. పెట్రోలు, డీజిల్​నిల్వ ఉంచుకోవాలన్నారు. రివ్యూ మీటింగ్​లో అడిషనల్​కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏఎస్పీ పంకజ్ పరితోష్, భద్రాచలం ఆర్డీఓ రత్నకల్యాణి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్​విస్తా కాంప్లెక్స్ వద్ద ఉన్న స్లూయిజ్​ను పరిశీలించారు. ఇరిగేషన్​ఇంజనీర్లకు పలు సూచనలు చేశారు. తర్వాత వివిధ రాజకీయ పార్టీల లీడర్లతో కలెక్టర్ సమావేశమయ్యారు. త్వరలో జిల్లా కలెక్టరేట్​తోపాటు నియోజకవర్గ కేంద్రాల్లో మాక్​పోలింగ్​నిర్వహించనున్నట్టు వెల్లడించారు.18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, శని, ఆదివారాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి ఓటర్ల నుంచి అభ్యంతరాలు తీసుకుంటామని చెప్పారు.
ముంపు బాధితులకు

పోలవరం ప్యాకేజీ ఇవ్వాలి: సీపీఎం

వరదల సమయంలో పోలవరం బ్యాక్ వాటర్​తో భద్రాచలంలోని పలు కాలనీలు మునుగుతున్నాయని, బాధితులకు పోలవరం ప్యాకేజీ ఇవ్వాలని సీపీఎం నాయకులు డిమాండ్​చేశారు. మంగళవారం నిర్వాసితులతో కలిసి ఆర్డీఓ ఆఫీస్​ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, మచ్చా వెంకటేశ్వర్లు, కారం పుల్లయ్య, గడ్డం స్వామితో కూడిన బృందంతో కలెక్టర్ అనుదీప్​తో మాట్లాడారు. వరదల నుంచి భద్రాచలాన్ని రక్షించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. స్లూయిజ్​ల వద్ద భారీ మోటార్లు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్​వివరించారు.