లోకేశ్వరంలో కలెక్టర్ సుడిగాలి పర్యటన

లోకేశ్వరంలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
  •     ఉన్నత పాఠశాలలో అపరిశుభ్రతపై ఆగ్రహం

లోకేశ్వరం, వెలుగు :  కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ లోకేశ్వరం మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. మండలంలోని అంతర్ జిల్లా చెక్ పోస్ట్, పోలింగ్ బూత్ లు, తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం, మండల కేంద్రంలో ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. ముందుగా లోకేశ్వరం అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు కృషి చేయాన్నారు. పిల్లలు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

మండల కేంద్రంలోని హైస్కూల్​లో ఏర్పాటు చేయనున్న పోలింగ్ బూత్ ను పరిశీలించేందుకు వెళ్లిన కలెక్టర్ అక్కడ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు క్లీన్​చేయాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఆయన నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. పంచగుడి వద్ద ఉన్న అంతర్ జిల్లా చెక్ పోస్ట్ ను సందర్శించారు. చెక్ పోస్ట్ లోని సిబ్బంది అలర్ట్ గా ఉండాలని, వాహనాల తనిఖీలను మొక్కుబడిగా చేపట్టవద్దని సూచించారు.

ఎన్నికలు సజావుగా ముగిసేందుకు సహకరించాలని కోరారు. తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ధరణిలో భూ సమస్యల పరిష్కారానికి చేపట్టిన చర్యలను పరిశీలించారు. ఎంపీడీఓ కార్యాలయంతోపాటు పక్కనే గల హరితహారం నర్సరీని పరిశీలించి మొక్కలు తక్కువగా ఎందుకు ఉన్నాయని సిబ్బందిని ప్రశ్నించగా కోతులు ధ్వంసం చేస్తున్నాయని చెప్పారు. కలెక్టర్​వెంట భైంసా ఆర్డీఓ కోమల్ రెడ్డి, తహసీల్దార్ మోతిరాం, ఎంపీడీఓ సాల్మన్ రాజ్, ఐసీడీఎస్ సీడీపీఓ శ్రీమతి, సూపర్​వైజర్ శ్రీలక్ష్మి తదితరులున్నారు.