- కలెక్టర్ బాదావత్ సంతోష్
కోడేరు, వెలుగు : జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అథారిటీ, కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ఆయన సందర్శించి ఎన్నికల సామగ్రిని కలెక్టర్ పరిశీలించారు. మండల కార్యాలయాల్లో నిర్వహించే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహణకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఎంపీడీవో నాగేంద్రంను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసే పోలింగ్ సిబ్బంది నుంచి ఫారం 17, డ్యూటీ ఆర్డర్ కాపీ చూసి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ వెనకాల కచ్చితంగా రిటర్నింగ్ అధికారి సంతకం ఉండాలని, లేనిపక్షంలో ఓటు చెల్లదన్నారు. డిసెంబర్ 14న నిర్వహించనున్న ఎన్నికల ఏర్పాట్లపై అధికారులకు అవగాహన కల్పించారు. బ్యాలెట్ బాక్సులు, మెటీరియల్ పంపిణీ కేంద్రంలో ఏర్పాటు చేయాల్సిన వసతులు, పోలింగ్ సిబ్బందికి భోజన ఏర్పాట్లు, రూట్లవారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై అప్రమత్తం చేశారు. ఆయన వెంట పెద్దకొత్తపల్లి తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో నాగేంద్రం, ఎంపీవో తదితరులు ఉన్నారు.

