పార్లమెంట్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిస్తాం : ​బదావత్​సంతోష్

పార్లమెంట్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిస్తాం : ​బదావత్​సంతోష్
  •     పోలింగ్ శాతం పెంచేందుకు ప్రత్యేక చర్యలు 
  •     సమావేశాల్లో జిల్లాల ఎన్నికల అధికారులు 

మంచిర్యాల/ఆదిలాబాద్, వెలుగు: లోక్​సభ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ​బదావత్​సంతోష్​ తెలిపారు. మోడల్​ కోడ్​ ఆఫ్​ కండక్ట్​ను పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. ఆదివారం ఆయన రామగుండం పోలీస్​ కమిషనర్ ఎం.శ్రీనివాస్, అడిషనల్​కలెక్టర్లు బి.రాహుల్, సబావత్ మోతీలాల్, స్పెషల్​డిప్యూటీ కలెక్టర్​ డి.చంద్రకళ, మంచిర్యాల ఆర్డీఓ రాములు, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లుతో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు.

జిల్లాలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 3 లక్షల 21 వేల 248 మంది పురుషులు, 3 లక్షల 26 వేల 353 మంది మహిళలు, 45 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నట్లు చెప్పారు. పోలింగ్ సెంటర్లకు రాలేని దివ్యాంగులు, వయోవృద్ధులు ఇంటి వద్దనే ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. చెన్నూర్​లో 227, బెల్లంపల్లిలో 227, మంచిర్యాలలో 287 మొత్తం 741 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి 741 మంది బూత్ లెవల్​ఆఫీసర్లను, 74 మంది సూపర్వైజర్లను నియమించామని తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు కమిషనరేట్​ పరిధిలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టామని సీపీ శ్రీనివాస్​ తెలిపారు. 

ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు

జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిస్తామని, ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదివారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ గౌస్ ఆలం, అడిషనల్ కలెక్టర్ శ్యామలా దేవితో కలిసి మాట్లాడారు. జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, కోడ్ ను ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఎలాంటి ఫిర్యాదులున్న సి విజిల్ యాప్ ద్వారా తెలియజేయాలని సూచించారు. ఎంసీసీ, సర్వేలెన్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, వీడియో సర్వేలెన్సు బృందాలతోపాటు ఇతర కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు సరిచూసుకోవాలని, జాబితాలో పేరు లేని వారు ఏప్రిల్ 15 వరకు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు.

మతం, కులం, ప్రాంతంపై విద్వేషాలు పెంచేలా వ్యాఖ్యలు చేయడం నిషేధమని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, బెదిరింపులకు పాల్పడటం, తప్పుడు ప్రచారాలు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్పీ గౌస్ ఆలం మాట్లాడుతూ జిల్లాలోని మహారాష్ట్ర బార్డర్ లో ఆరు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి గట్టి నిఘా పెట్టామన్నారు. అక్రమ నగదు, లిక్కర్ సరఫరా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.