బయోమెట్రిక్ అటెండెన్స్​ తప్పనిసరి : కలెక్టర్​ ప్రియాంక అల

బయోమెట్రిక్ అటెండెన్స్​ తప్పనిసరి : కలెక్టర్​ ప్రియాంక అల

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : అన్ని ప్రభుత్వ శాఖల్లో బయోమెట్రిక్​ అటెండెన్స్​ తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్​ డాక్టర్​ ప్రియాంక అల ఆదేశించారు. కలెక్టరేట్ లో పలు శాఖల ఆఫీసర్లతో సోమవారం నిర్వహించిన రివ్యూ మీటింగ్​లో ఆమె మాట్లాడారు. కొన్ని శాఖల్లో బయోమెట్రిక్​ అటెండెన్స్​ తక్కువగా ఉండడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్కువ అటెండెన్స్​ఉన్న శాఖల ఆఫీసర్లకు షోకాజ్​నోటీస్​లు ఇవ్వాలని ఏఓను ఆదేశించారు.  ప్రతి వారం బయోమెట్రిక్​ అటెండెన్స్​పై రివ్యూ  చేస్తామని పేర్కొన్నారు.  ఎన్నికల కోడ్​నేపథ్యంలో కొత్తగా అభివృద్ధి పనులు చేపట్టవద్దన్నారు.

ప్రస్తుతం జరుగుతున్న పనులపై నివేదికలను అందజేయాలన్నారు. గవర్నమెంట్​ఆఫీస్​లలో రాజకీయ నాయకుల ఫోటోలు కనిపిస్తే సీరియస్​ యాక్షన్​ ఉంటుందన్నారు. అంగన్​వాడీ కేంద్రాల్లో రెయిన్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్  ఏర్పాటుపై చర్చించారు. రివ్యూలో అడిషనల్​ కలెక్టర్లు రాంబాబు, మధుసూదనరాజు, డీఆర్​ఓ రవీంద్రనాథ్​ పాల్గొన్నారు. 

ఎన్నికల నిబంధనలను పక్కాగాఅమలు చేయాలి ..

ఎన్నికల నిబంధనలకు పక్కాగా అమలు చేయాలని ఆఫీసర్లను కలెక్టర్​ ప్రియాంక ఆదేశించారు. కలెక్టరేట్​ నుంచి అన్ని శాఖల జిల్లా ఆఫీసర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో ఆమె మాట్లాడారు.  పోలింగ్​ కేంద్రాలను సెక్టోరియల్​ ఆఫీసర్లు సందర్శించాలన్నారు. పోలింగ్​ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో  నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.  అంతకుముందు కలెక్టరేట్​లో కలెక్టర్​ గ్రీవెన్స్​ నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులను తీసుకున్నారు.