ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలి : శరత్

ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలి : శరత్

సంగారెడ్డి టౌన్ ,వెలుగు :  అకాల వర్షాలకు జిల్లాల ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఆఫీసర్లను కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ  సాఫీగా జరగాలన్నారు. బుధవారం కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ మాధురితో కలిసి  ధాన్యం కొనుగోళ్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు.  

ధాన్యం తడవకుండా రైతులకు ఎక్కువ సంఖ్యలో టార్పాలిన్స్ ఇవ్వాలని సూచించారు. సేకరించిన ధాన్యాన్ని వెంటవెంటనే రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో  ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. రైతుల నుండి ఎలాంటి ఫిర్యాదులు రావద్దన్నారు. కొనుగోళ్లలో ఎలాంటి తప్పిదం జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  

వర్షాలు కురుస్తున్నందున ట్రాన్స్ పోర్ట్​ కాంట్రాక్టర్లను అప్రమత్తం చేయాలన్నారు. జిల్లాలో  ఇప్పటివరకు  198 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 26,423 మంది రైతుల నుంచి 1,44,393 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. 19,532 మంది రైతులకు రూ.236.76 కోట్లు చెల్లించామన్నారు. కాన్ఫరెన్స్ లో  డీఆర్డీవో శ్రీనివాసరావు, అధికారులు నర్సింహారావు,  ప్రసాద్,  వనజాత,  సుగుణ భాయ్,  తదితరులు పాల్గొన్నారు.