రిమ్స్లో గుండె జబ్బుల వైద్య శిబిరం..తల్లిదండ్రులపై భారం పడకుండా చికిత్స అందించాలి: కలెక్టర్ 

రిమ్స్లో గుండె జబ్బుల వైద్య శిబిరం..తల్లిదండ్రులపై భారం పడకుండా చికిత్స అందించాలి: కలెక్టర్ 

ఆదిలాబాద్, వెలుగు: గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా అవసరమైన అన్ని వైద్య సేవలు అందించేలా ప్రణాళికలు రూపొందించాలని రిమ్స్​హాస్పిటల్​అధికారులను కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు.

వైద్య పరీక్షలు, మందులు, స్కానింగ్, 2డీ ఈకో వంటి సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. గురువారం రిమ్స్ లో అపోలో, ఆర్‌బీఎస్‌కే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిన్నారులకు ఉచిత గుండె జబ్బుల వైద్య శిబిరాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ శిబిరానికి ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 150 మంది చిన్నారులు వచ్చారు.

వైద్యులు వారికి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఆపరేషన్​ కోసం హైదరాబాద్‌కు రావాలని సూచించారు. పేదలకు నాణ్యమైన వైద్యం ఉచితంగా అందించేందుకు అపోలో ఆసుపత్రి ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్, డాక్టర్లు వైసీ శ్రీనివాస్, సమీయుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

సీనియర్ సిటిజన్లను గౌరవించాలి

సీనియర్ సిటిజన్లకు ప్రతి ఒక్కరూ గౌరవించాలని కలెక్టర్ సూచించారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. వయోవృద్ధుల సంరక్షణ కోసం ప్రభుత్వం సీనియర్ సిటిజన్ యాక్ట్ ను తీసుకొచ్చిందని, ఈ చట్టంపై విస్తృత ప్రచారం చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

వయోవృద్ధుల సంరక్షణ టోల్ ఫ్రీ నంబర్ పోస్టర్‌ను ఆవిష్కరించి, పలువురిని సన్మానించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, వయోవృద్ధుల సమైక్య సభ్యులు దేవిదాస్, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

కలెక్టర్​కు ఉద్యోగ సంఘాల సన్మానం  

జల సంరక్షణ, నీటి వనరుల సద్వినియోగంలో జిల్లాను జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం లో నిలిపి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అవార్డు స్వీకరించిన కలెక్టర్ రాజర్షి షాను గురువారం ఉద్యోగ సంఘాల నాయకులు సన్మానించారు.

టీజీవో, టీఎన్జీవో యూనియన్ నాయకులు కలెక్టర్ ను కలిసి అభినందనలు తెలిపారు. జిల్లా గెజిటెడ్ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు శివకుమార్, టీఎన్జీవో జిల్లా సెక్రటరీ నవీన్ కుమార్, టీజీవో యూనియన్ జిల్లా సెక్రటరీ రామారావు రాథోడ్, ఉద్యోగులు పాల్గొన్నారు.