- రాజన్నసిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్
రాజన్నసిరిసిల్ల, వెలుగు: మహిళా సంఘాల సభ్యులు గ్రామాల్లో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవనాలను సద్వినియోగం చేసుకోవాలని రాజన్నసిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్ సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మహిళా వారోత్సవాల సందర్భంగా గంభీరావుపేట మండలం రాజేశ్వర్ రావు కాలనీలో కొత్తగా నిర్మించిన ఇందిరా మహిళా శక్తి భవనాన్ని ఆమె బుధవారం ప్రారంభించారు.
గ్రామాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు నిర్మించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, జిల్లాలో ఇప్పటివరకు 113 భవనాలు నిర్మించడానికి అనుమతులు మంజూరు చేశామని, 103 గ్రౌండింగ్ పూర్తి చేసి వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ కె.విజయ, డీఆర్‌డీవో లక్ష్మీనారాయణ, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య తదితరులు పాల్గొన్నారు.
