కొనుగోలు సెంటర్లలో వడ్లు అమ్మాలి : కలెక్టర్​ హనుమంతు

కొనుగోలు సెంటర్లలో వడ్లు అమ్మాలి : కలెక్టర్​ హనుమంతు

యాదాద్రి, వెలుగు : రైతులు వడ్లను బయట వ్యక్తులకు అమ్మకుండా కొనుగోలు కేంద్రాలకు తేవాలని, మద్దతు ధర పొందాలని కలెక్టర్​ హనుమంతు జెండగే కోరారు. జిల్లాలోని వీరవెల్లి, కొరటికల్​, ఆత్మకూర్ (ఎం), ఆలేరు  వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులతో   మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు పలు సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. ప్యాడీ క్లీనర్​ యంత్రాలు సరిగా అందిస్తలేరని, టార్పాలిన్లు అందడం లేదని తెలిపారు. స్థలం లేక వడ్లను  ఆరబెట్టుకోవడంలో ఇబ్బంది కలుగుతోందని చెప్పారు.

ఈ కారణంగా తేమ విషయంలో కొంత ఇబ్బంది  కలుగుతోందని వివరించారు. రైతుల సమస్యలు విన్న ఆయన అన్ని సమకూరుస్తామని చెప్పారు. రైతుల ముందే మార్కెట్​, అగ్రికల్చర్​ ఆఫీసర్లకు ఆదేశించారు. ప్రతి ఒక్కరి నుంచి వడ్లను కొనుగోలు చేస్తామని, ఎలాంటి కంగారు పడవద్దని కలెక్టర్​ కోరారు.  టార్పాలిన్లు, గన్నీ బ్యాగుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు.

అడిషనల్​ కలెక్టర్​ పీ బెన్​ షాలోమ్​, ఆర్డీవో అమరేందర్​, జిల్లా మార్కెటింగ్ అధికారి సబిత, సివిల్ సప్లయ్ డీఎం.గోపీకృష్ణ, జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాసరెడ్డి, జిల్లా సహకార శాఖ ఇన్​చార్జి అధికారి పి.ప్రవీణ్ కుమార్, తహశీలుదార్లు అంజిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు, మార్కెట్ కమిటీల సెక్రటరీలు ఉన్నారు.