యాదాద్రి, వెలుగు : వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవాలని కలెక్టర్ హనుమంతు జెండగే సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవంలో ఆయన మాట్లాడారు. వృద్ధుల సంక్షేమం కోసం 2007లో చట్టం వచ్చిందన్నారు. ఈ చట్టం ప్రకారం తమ తల్లిదండ్రులను ఆర్థికంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా పర్యవేక్షించాల్సిన బాధ్యత పిల్లలపై ఉందని తెలిపారు. సీనియర్ సిటిజన్స్ కు పెన్షన్, ఆరోగ్య బీమా వంటి సౌకర్యాలను ప్రభుత్వం కల్పించిందన్నారు. పిల్లలు చూడకుంటే పెద్దలు మెయిన్టెనెన్స్ ట్రిబ్యునల్‌కు అప్లయ్చేసుకోవచ్చని చెప్పారు.
తల్లిదండ్రుల సంరక్షణ చూడని పిల్లలపై చర్యలు తీసుకోవడానికి చట్టం అవకాశం కల్పించిందన్నారు. అడిషనల్ కలెక్టర్గంగాధర్ మాట్లాడుతూ పిల్లలకు ఆస్తుల పంపకం చేసేటప్పుడు తలిదండ్రులు తమ గురించి ఒక్కసారి ఆలోచించుకోవాలని సూచించారు. తల్లిదండ్రులను భారంగా కాకుండా బాధ్యతగా చూసుకోవాలన్నారు. అనంతరం సీనియర్సిటిజన్అసోసియేషన్మెంబర్లను సన్మానించారు. కారక్రమంలో ఆర్డీవోలు అమరేందర్, శేఖర్‌రెడ్డి, వెల్ఫేర్ ఆఫీసర్ నర్సింహారావు, డీఎంహెచ్‌వో యశోద, ఏసీపీ రమేశ్, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ప్రతిఒక్కరూ వయోవృద్ధులను గౌరవించాలి
ప్రతిఒక్కరూ వయోవృద్ధులను గౌరవించాలి
సూర్యాపేట, వెలుగు : ప్రతిఒక్కరూ వయోవృద్ధులను గౌరవించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. కలెక్టరేట్లో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రుల సంరక్షణ చట్టంపై అందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. సూర్యాపేటలో వయోవృద్ధుల సంక్షేమ భవన నిర్మాణాన్ని డిసెంబర్ కల్లా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. వయోవృద్ధుల కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం వయోవృద్ధులను సన్మానించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
వయోవృద్ధులు లేని సమాజం ఊహించలేనిది
నల్గొండ అర్బన్, వెలుగు : వయోవృద్ధులు లేని సమాజం ఊహించలేనిదని అడిషనల్ కలెక్టర్ టి.పూర్ణచంద్ర అన్నారు. నల్గొండలోని కలెక్టరేట్ లో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వయోవృద్ధుల సేవలను మర్చిపోవద్దన్నారు. కుటుంబ పెద్దలను గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. అనంతరం వయోవృద్ధులను సన్మానించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రాములునాయక్, జిల్లా సంక్షేమ అధికారి సక్కుబాయి, డీఆర్డీఏ అడిషనల్ పీడీ శారద, వయో వృద్ధులు తదితరులు పాల్గొన్నారు.