సంగారెడ్డి టౌన్, వెలుగు: జిల్లాలో రేషన్‌బియ్యం అక్రమ రవాణాను అరికట్టాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. గురువారం సంగారెడ్డి కలెక్టరేట్ లో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పౌరసరఫరాల శాఖ నమోదు చేసిన కేసుల పురోగతిపై అధికారులతో చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కేసులను వేగంగా పరిష్కరించాలని, అక్రమంగా బియ్యం రవాణా చేస్తున్న వారిపై పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు.
బియ్యం పట్టుబడినప్పుడు అధికారులు తప్పనిసరిగా వీడియో, ఫొటో ఆధారాలను సేకరించి, 6-ఏ నివేదికకు జతపరిచి సమర్పించాలన్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని 15 రోజులకు ఒకసారి పత్రికలలో ప్రకటన ఇచ్చి బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని సూచించారు. జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా పటిష్ట నిఘా పెట్టాలని, అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్ మాధురి, సివిల్ సప్లై డీఎం అంబదాస్ రాజేశ్వర్, కమర్షియల్ టాక్స్ అధికారులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు
