సిద్దిపేట జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలి

సిద్దిపేట జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలి

సిద్దిపేట రూరల్, వెలుగు: జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. గురువారం సిద్దిపేట కలెక్టరేట్ లో ఆయా శాఖల అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ అత్యంత పారదర్శకంగా కొనుగోలు జరగాలన్నారు. వరికోతలు వేగంగా కొనసాగుతున్నందున అన్ని కొనుగోలు సెంటర్లను ప్రారంభించాలని అధికారులకు సూచించారు. సెంటర్లలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచాలన్నారు. రిజిస్టర్లు తప్పనిసరిగా మెయింటెన్ చెయ్యాలన్నారు. రెండు నెలలు పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు రోజు సెంటర్లను పర్యవేక్షించాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీవో జయదేవ్ ఆర్య, డీసీఎస్ఓ తనూజ, డీఎంఎస్ఓ ప్రవీణ్ పాల్గొన్నారు.

 కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్​

చేర్యాల: చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ హైమావతి తనిఖీ చేశారు. తేమశాతం వచ్చినా ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడంలేదని సిబ్బందిని ప్రశ్నించారు. వెంటనే వడ్లు క్లీనింగ్ చేయించి సంచుల్లో నింపి లోడ్ చేయించాలని సెంటర్ సిబ్బంది, తహరసీల్దార్ ను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు చేయాలని విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ప్రాంగణంలోని మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తేమశాతం తనికి చేశారు
. మొక్కజొన్నలు ఎండాక క్లీనింగ్ చేసి వెంటనే లోడ్ చేయాలని సెంటర్ సిబ్బందిని ఆదేశించారు.

మెనూ పాటించకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం

కొండపాక: మండల పరిధిలోని దుద్దెడ జడ్పీ హైస్కూల్​లో కలెక్టర్​ హైమావతి తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులకు వడ్డించిన భోజనాన్ని రుచి చూసి మెనూ ప్రకారం వంటకాలు ఎందుకు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట సిబ్బంది  గైర్హాజరుతో పచ్చి పులుసు చేశామని ప్రిన్సిపాల్ చెప్పడంతో అతడిపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని డీఈవోను ఫోన్​లో ఆదేశించారు. అనంతరం పీహెచ్​సీని సందర్శించి. సిబ్బంది గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి జీతాల్లో కోత విధించాలని, సమయపాలన పాటించని  సిబ్బందికి ఆబ్సెంట్ వేయాలని డీఎంహెచ్​వోను ఆదేశించారు .

 బోండాకు బదులు జీరా రైస్, సాంబార్

హుస్నాబాద్: మండలంలోని పోతారం (ఎస్) గ్రామంలోని మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్లో గురువారం విద్యార్థులకు టిఫిన్​గా బోండా ఇవ్వాల్సి ఉండగా అధికారులు జీరా రైస్, సాంబార్ వడ్డించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లలో మెనూ ప్రకారం టిఫిన్​, భోజనం పెట్టాలని ఆదేశాలు జారీ చేసినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 

 విషయం తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ వీణను వివరణ కోరగా కాంట్రాక్టర్లు వేతనాలు పెంచాలని, తమకు సరఫరా ఖర్చులు ఎక్కువవుతున్నాయని చెబుతున్నారని పేర్కొన్నారు.