- నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్గొండ, వెలుగు: ప్రసూతి వార్డులో పురుషులు ఉండడం ఏంటని కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డులో ఉన్న వారందరినీ వెంటనే బయటికి పంపాలని ఆదేశించారు. మంగళవారం ఆమె నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రిలోని ప్రసూతి వార్డు, చిన్న పిల్లల వార్డు, ఐసీయూ తదితర వార్డుల్లో తనిఖీలు నిర్వహించారు.
ప్రసూతి వార్డులో పురుషులు ఉండడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే అందరిని బయటకు పంపించాలని, పురుషులను ప్రసూతి వార్డులోకి ఎందుకు అనుమతించారని డ్యూటీ డాక్టర్, ఆస్పత్రి సూపరిండెంట్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో ప్రసవించిన మహిళలకు సహాయకులు ఎక్కువమంది ఉండడం వల్ల చిన్న పిల్లలకు ఇన్‌ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందన్నారు.
అందువల్ల ఎక్కువ మంది ఉండకుండా, కేవలం ఒక్కరు మాత్రమే సహాయకులుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆసుపత్రిలోని ప్రతి వార్డులో ఉన్న సీసీ కెమెరాలు, ఆరు బయట వాహనాలు నిలిపే చోట ఇతర ముఖ్యమైన స్థలాలలో ఉన్న సీసీ కెమెరాలను ఆమె తనిఖీ చేశారు.
ఆసుపత్రిలో ఉన్న అన్ని సీసీ కెమెరాలు నిరంతరం పనిచేయాలని ముఖ్యంగా ప్రధాన గేటు వద్ద ఉన్న సీసీ కెమెరాలు 24 గంటలు పని చేసేలా చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి వర్గాలను ఆదేశించారు. ప్రత్యేకించి ఆటోలు నిలిపే చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ అరుణకుమారి, డాక్టర్ వందన, డాక్టర్ నగేష్ , తదితరులు పాల్గొన్నారు.
