బీమా పెంపును సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

బీమా పెంపును సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
  • కలెక్టర్ ఇలా త్రిపాఠి 

నల్గొండ అర్బన్, వెలుగు: కార్మికులు బీమా పెంపును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. సోమవారం నల్గొండ కలెక్టరేట్ లో కార్మికుల బీమా పెంపు పోస్టర్​ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమ మండలిలో నమోదు చేసుకున్న కార్మికులకు కొత్తగా ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్ విధానంతో లబ్ధి చేకూరుతుందన్నారు. ఉప కార్మిక కమిషనర్ స్వామి మాట్లాడుతూ సహజ మరణానికి రూ.2 లక్షలు,  ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షలు ఇస్తారన్నారు.

 రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ మంత్రి వివేక్ వెంకట్ స్వామి నేతృత్వంలో 16.50 లక్షల మంది కార్మికులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను పొందడానికి బీఓసీ డబ్ల్యూ రిజిస్ట్రేషన్, రెన్యువల్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు  శ్రీనివాస్, అమిత్ నారాయణ, ఆర్డీవోలు అశోక్ రెడ్డి, శ్రీదేవి పాల్గొన్నారు. 

 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టింగ్ ఇవ్వాలి

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల స్కూల్​, జూనియర్ కాలేజీ నకిరేకల్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా 15 ఏళ్లు పనిచేసిన తనను అకారణంగా సూర్యాపేట జిల్లా మట్టంపల్లి గురుకుల స్కూల్​కు పంపించారని, దీనివల్ల ఇబ్బందులు ఎదురొంటున్నానని శోభారాణి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.  సోమవారం కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిసి తన గోడు వెళ్లబోసుకొని వినతిపత్రం అందించింది. ఆమె మాట్లాడుతూ అనారోగ్య సమస్యల కారణంగా మట్టంపల్లి గురుకుల స్కూల్​కువెళ్లిరాలేకపోతున్నానని, తన భర్త ఇటీవల చనిపోవడంతో ఆర్థికంగా ఇబ్బందిగా ఉందని వాపోయింది. 

ఈ విషయంపై గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కలిసి తన బాధను విన్నవించుకున్నానన్నారు. ఆయన నల్గొండ పరిసర ప్రాంతాల్లోని గురుకుల స్కూల్​లో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా నియమించాలని అధికారులకు చెప్పినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన పాత ప్లేస్ లోనే ఉద్యోగం కొనసాగించాలని వేడుకుంది.