- ఏకగ్రీవమయ్యే పంచాయతీలకు ప్రభుత్వ ప్రోత్సాహకం గురించి వివరించండి
- ఆఫీసర్లకు సూచనలు చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
నార్కట్పల్లి, వెలుగు: పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పారితోషికం గురించి తెలియజేయాలని ఆఫీసర్లకు కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలరాలు ఐఏఎస్ అధికారి రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కొర్రా లక్ష్మి గురువారం నార్కట్ పల్లి క్లస్టర్ నామినేషన్ కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి తనిఖీ చేశారు.
అక్కడ ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను పరిశీలించి నామినేషన్లు వేసేందుకు వచ్చిన అభ్యర్థులకు ఇస్తున్న సూచనలు, సలహాలు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. నామినేషన్ల స్వీకరణ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నియమ నిబంధనలను పాటించాలన్నారు. నామినేషన్ వేసే సమయంలో అభ్యర్థులకు ఖర్చులు, ఇతర పూర్తి వివరాలను తెలియజేయాలన్నారు. నామినేషన్ కేంద్రం వద్ద అవసరమైన బందోబస్తు, వంద మీటర్ల పరిధిలో తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాల పై వివరించారు.
ఎన్నికల సంఘం ఆదేశించిన మేరకు నిర్దేశించిన సమయంలో నామినేషన్లను స్వీకరించాలని , ఎన్నికల్లో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పనిచేయాలని కోరారు. వీరి వెంట స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి, జిల్లా అబ్జర్వర్ల నోడల్ అధికారి , పశు సంవర్థక శాఖ అధికారి డాక్టర్ రమేశ్, ఎంపీడీవో ఉమేశ్ తదితరులున్నారు.
