చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తాం : ఇలా త్రిపాఠి

చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తాం : ఇలా త్రిపాఠి

యాసంగి ధాన్యం కొనుగోలుకు ములుగు జిల్లాలో 144 సెంటర్లు 
మొదటి విడతగా 22 కేంద్రాలను ప్రారంభించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

ఏటూరునాగారం, వెలుగు :  యాసంగి వడ్లను చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని ములుగు కలెక్టర్​ ఇలా త్రిపాఠి అన్నారు. ఇందుకోసం జిల్లాలో 144 సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సోమవారం ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఆకులవారి గణపురంలో జీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అడిషనల్​ కలెక్టర్ మహేందర్ జీతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు.

అనంతరం స్థానిక రైతు వేదికలో జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలుపై నిర్వాహకులకు ఏర్పాటు చేసిన శిక్షణా తరగతుల కార్యక్రమంలో కలెక్టర్​మాట్లాడారు. ములుగు జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించడానికి 144 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా, మొదటి విడతలో భాగంగా సోమవారం ములుగు మండలంలో 3, వెంకటాపూర్ 3, గోవిందరావుపేట 3, తాడ్వాయి 3, ఏటూరునాగారం 3, మంగపేట 2, వెంకటాపురం 2 , కన్నాయిగూడెం 1, వాజేడు ఒక కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. ఏప్రిల్ రెండో వారంలో మరో 73, మూడో వారంలో మిగితా 49 కేంద్రాలను ప్రారంభిస్తామని కలెక్టర్ తెలిపారు.

గ్రేడ్ ఏ రకం ధాన్యానికి రూ.2,203, సాధారణానికి రూ.2,183 మద్దతు ధరతో ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. ఇతర రాష్ర్టాల్లో పండించిన ధాన్యం మన జిల్లాలోకి రాకుండా తెలంగాణ, ఛత్తీస్​గడ్ సరిహద్దులో వాజేడు మండలం పేరూరులో చెక్ పోస్ట్ ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లై మేనేజర్ రాంపతి, డీఏవో విజయ్ చంద్ర, డీసీవో సర్దార్ సింగ్, గిరిజన సహకార సంస్థ మేనేజర్ దేవా, తహసీల్దార్​జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.