నస్పూర్/నిర్మల్/ఆదిలాబాద్టౌన్/ఆసిఫాబాద్, వెలుగు: ప్రజావాణిలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ పి.చంద్రయ్య, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్ రావుతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మందమర్రి మండలం తుర్కపల్లిలోని ప్రభుత్వ స్కూల్లో మినీ అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని, అడ్డా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, పింఛన్ ఇప్పించాలని.. తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు దివ్యాంగ పింఛన్ ఇప్పించాలని, ప్రతి నెల సదరం శిబిరాలు నిర్వహించాలని కోరుతూ దరఖాస్తులు అందించారు.
దరఖాస్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలి
ప్రజావాణి దరఖాస్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అర్జీలపై అధికారులు వెంటనే స్పందించి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సమీక్షించి, సంబంధిత శాఖల సమన్వయంతో చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రత్నకల్యాణి, జడ్పీ సీఈవో గోవింద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ ప్రజావాణికి 108 దరఖాస్తులు
ఆదిలాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో 108 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ రాజర్షి షా అర్జీదారులతో మాట్లాడి దరఖాస్తులు స్వీకరించారు. ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, ఉపాధి, భూభారతి సహా వివిధ విభాగాలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. దరఖాస్తులను పరిశీలించి వెంటనే సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర గీతం రచయిత, కవి అందెశ్రీ మృతిపట్ల మౌనం పాటించి సంతాపం తెలిపారు. అడిషనల్కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో స్రవంతి, డిప్యూటీ కలెక్టర్ వంశీకృష్ణ, అధికారులు పాల్గొన్నారు.
పక్కా ఇండ్లు మంజూరు చేయాలి
ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్ ఎం.డేవిడ్ ఆదేశించారు. కలెక్టరేట్లో దరఖాస్తు స్వీకరించారు. జైనూర్ మండలం పానపటార్కు చెందిన గిరిజన రైతులు ప్రధానమంత్రి జన్ మన్ పథకం కింద పక్కా ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, పంట నష్టపరిహారం ఇప్పించాలని, పట్టా భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని అర్జీదారులు దరఖాస్తులు అందజేశారు.
