- కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్, వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో ఉన్న మాతాశిశు ఆస్పత్రిని తనిఖీ చేశారు. వార్డులు, ల్యాబ్, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని.. గర్భిణులు, బాలింతల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, గర్భిణులు సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించుకునేలా అవగాహన కల్పించాలని, పోషకాహారం, మందులు అందించాలని సూచించారు. వార్డులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆస్పత్రిలో అవసరమైన వైద్య పరికరాలు, ఇతర సదుపాయాలు సమకూరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను విజయవంతం చేయాలి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చేపట్టిన ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను జిల్లాలో విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్లో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, సీఎఫ్‌ఎల్ కౌన్సిలర్లతో కలిసి కార్యక్రమ వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆర్బీఐ ఆధ్వర్యంలో ఈ నెల 9 నుంచి 13 వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు- నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు కేవైసీ మోసం, మనీమ్యూల్, బ్యాంకింగ్ అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
