రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : కలెక్టర్ కుమార్ దీపక్

రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : కలెక్టర్ కుమార్ దీపక్
  • కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్, వెలుగు: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్​లో డీసీపీ ఎ.భాస్కర్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్​తో కలిసి పోలీస్, రెవెన్యూ, రవాణా, జాతీయ రహదారులు, రోడ్లు భవనాలు, విద్యుత్, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులతో రోడ్డు ప్రమాదాల నివారణపై రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు.

కలెక్టర్ మాట్లాడుతూ.. యాక్సిడెంట్లను అరికట్టేందుకు మున్సిపల్ పరిధిలోని రోడ్లపై చెత్త వెంటనే తొలగించాలని, రోడ్లపై వాహనా నిలుపుదల, నిబంధనల ఉల్లంఘించిన వారిపట్ల కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్లపై బీమ్‌లు, లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు.

హైవేల్లో ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో జాగ్రత్త సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. సెల్లార్ స్థలాలు కేవలం పార్కింగ్ కోసం మాత్రమే ఉపయోగించేలా మున్సిపల్ కమిషనర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, రోడ్డు భద్రత నియమాలపై చైతన్యం తీసుకురావాలన్నారు. 

ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు

ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. నస్పూర్ మండలం తాళ్లపల్లి సమీపంలోని గోదావరి తీరం వద్ద, హాజీపూర్ మండలం ముల్కల్ల సమీపంలోని సాండ్ రీచ్​లను స్థానిక సందర్శించారు.

వినియోగదారుల సౌకర్యాం కోసం ప్రభుత్వం ఇసుక రీచ్​లను ఏర్పాటు చేసి ఆన్​లైన్​లో బుక్ చేసుకున్న వారికి రవాణా చేస్తోందని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా పర్యవేక్షించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హాజీపూర్ మండలంలోని గుడిపేట, నంనూర్​లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి అధికారులకు సూచనలు చేశారు