
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల–వరంగల్ నేషనల్హైవే 163 భూసేకరణ అక్టోబర్లోగా పూర్తి చేస్తామని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా భూసేకరణ, పరిహారం చెల్లింపుపై సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఫారెస్ట్ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్ హెచ్163జీ పరిధిలో 3 ఫేజ్ఆర్బిట్రేషన్ కోసం దాఖలు చేసిన114 కేసులను పరిశీలిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని 17 గ్రామాల్లో కోర్టు స్టే ఉన్న గ్రామాలను మినహాయించి మిగతాచోట్ల అవార్డు జారీ చేశామని ఆయన పేర్కొన్నారు.
భూ సమస్యలపై దరఖాస్తులు
కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో 50కి పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటిలో మెజారిటీ ఫిర్యాదులు భూసమస్యలపైనే ఉన్నాయి. ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని బాధితులు కలెక్టర్‌కుమార్ దీపక్‌కు విన్నవించారు. హాజీపూర్ మండలం ముల్కల్లకు చెందిన రావుల లక్ష్మణ్‌బాబు గ్రామ శివారులో ఉన్న తన భూమి ఇతరుల పేరిట మారిందని, వారి పేర్లు తొలగించి తమ పేరుతో పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని కోరాడు. బుద్ధిపల్లికి చెందిన ఐరగడ్డ దేవమ్మ తాను గతంలో కొనుగోలు చేసిన భూమిని తన పేరిట మార్చి పట్టా పాసుబుక్ ఇవ్వాలన్నారు.
తాండూర్ మండలం గోపాల్, నాగారం గ్రామానికి చెందిన గాజుల తిరుపతి, గాజుల వెంకటేశం, గాజుల రవి తమ తండ్రి పేరిట తాండూర్ శివారులో ఉన్న భూమి రెవెన్యూ రికార్డుల్లో ఇతరుల పేరిట ఉన్నట్లు చూపుతోందని తెలిపారు. ఈ పొరపాటున సవరించి తమ పేరిట మార్చాలని విన్నవించారు. బెల్లంపల్లి మండలం బూదకలాన్‌కు చెందిన రైతులు తమ చేలల్లోకి వెళ్లడానికి దారి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
వార్డెన్లపై ఫిర్యాదు..
లక్షెట్టిపేట బీసీ హాస్టల్, బెల్లంపల్లి ఎస్సీ హాస్టల్వార్డెన్లపై ఏఐఎస్బీ ప్రతినిధులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. విద్యార్థుల సంక్షేమం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.