మౌలానా అబుల్ కలాం సేవలు చిరస్మరణీయం : కలెక్టర్ కుమార్ దీపక్

మౌలానా అబుల్ కలాం సేవలు చిరస్మరణీయం :  కలెక్టర్ కుమార్ దీపక్

ఆసిఫాబాద్/నస్పూర్/నేరడిగొండ/ఖానాపూర్, వెలుగు: దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా అనేక  సంస్కరణలతో విద్యారంగ అభివృద్ధికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎనలేని కృషి చేశారని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా కలెక్టరేట్ లో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

 అడిషనల్ కలెక్టర్ పి.చంద్రయ్య, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరితో కలిసి ఆజాద్ ఫొటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భారత తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. స్వాతంత్ర పోరాటంలో ఆజాద్​కీలక పాత్ర పోషించారని, విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశారని, బాలిక విద్యను ప్రోత్సహించారని గుర్తుచేశారు.

విద్యారంగ అభివృద్ధికి ఎనలేని సేవలు

దేశంలో విద్యారంగ అభివృద్ధికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎనలేని కృషి చేశారని ఆసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. అబుల్ కలాం ఆజాద్ 127వ జయంతి, మైనారిటీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవాలను పురస్కరించుకొని కలెక్టరేట్ లో ఏర్పాటుచేసిన వేడుకలకు డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నదీమ్, మైనారిటీ ప్రతినిధులతో కలిసి ఆజాద్ ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

నేరడిగొండలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జయంతి వేడుకలు నిర్వహించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలను యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ప్రిన్సిపాల్ శబానా తరన్నం పిలుపునిచ్చారు.

స్టూడెంట్లకు వ్యాసరచన పోటీలు

భారత దేశ తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆ జాద్ ను ప్రతి ఒక్క యువత స్పూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని వక్తలు పేర్కొన్నారు. ఖానాపూర్ లోని మైనార్టీ బాలుర గురుకులంలో వేడుకలు జరిపారు.

 విద్యార్థులకు వివిధ అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. మాజీ కౌన్సిలర్ షబ్బీర్ పాషా, జామ మసీదు అధ్యక్షుడు జహీర్, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం అధ్యక్షుడు షౌకత్ పాషా, ఎంఐఎం మండల అధ్యక్ష, కార్యదర్శులు అఖిల్, అఫ్సర్, స్కూల్ ప్రిన్సిపాల్ హైమద్ తదితరులు  పాల్గొన్నారు.